Hyderabad Rains: హైదరాబాద్ ను కుండపోత వాన కుమ్మేసింది. ఒకటి రెండు కాదు దాదాపు 4 గంటలకుపైగా వర్షం పడడంతో.. నగరం తడిసిముద్దైంది. ఎక్కడికక్కడ రోడ్లు చెరువులు అయ్యాయి. మోకాలి లోతులో నీరు నిలిచిపోయింది. దీంతో ఆఫీసుల నుంచి, షాపుల నుంచి తిరిరి ఇంటికి చేరుకోవాలనుకున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ గతకలమయం అవ్వడంతో ప్రధాన జంక్షన్లల్లో అర్థరరాత్రి కూడా ట్రాఫిక్ జామ్ కనిపించింది.
ముఖ్యంగా నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్పేట్, కాచిగూడ, గోల్నాక, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్‌రోడ్, లక్డీకాపూల్, కోఠి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, సరూర్‌నగర్, సైదాబాద్, కూకట్పల్లి, ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్, ప్రగతినగర్, నిజాంపేట, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, పాతబస్తీ, చంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, బార్కస్, బహదూర్‌పూర, ఫలక్నామా ఇలా నగరంలోని దాదాపు అన్ని చోట్ల భారీ వర్షం కురిసింది.
నగరంలో అత్యధికంగా మనికొండలో 105 మిల్లీ మీటర్లు, షేక్‌పేట్‌లో 86, ఫిల్మ్ నగర్లో 83, మలక్‌పేటలో 69.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. నగర వాసులు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. సాయం కోసం 040-29555500 కు సంప్రదించాలని కోరారు. రంగంలోకి దిగిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కొన్ని చోట్ల చెట్లు కింద పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. అయితే ఈ వానలు ఇప్పట్లో వదిలేట్టు లేవు. బంగాళ ఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చడంతో నగరంలో ఈ భారీ వర్షాలు కురిశాయి. ఇక తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిందే. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ తెలిపింది. వాయుగుండం ఆదివారం సాయంత్రం ఒడిశా తీర ప్రాంతం దాటే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. దీని ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనావేసింది. అటు తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. మత్సకారులు ఈ నెల 27వ తేదీ వరకు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.