ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలు, కార్లు సహా వందలాది ఎలక్ట్రిక్ వాహనాలు హైదరాబాద్ రోడ్లపై పరుగులు తీశాయి. హైదరాబాద్ లో తొలిసారిగా నిర్వహించిన ర్యాలీ-ఇ అందరినీ ఆకర్షించింది. పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, నటుడు అడివి శేష్ , డైరెక్టర్ నాగ్ అశ్విన్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు.
ఈ ర్యాలీ పీపుల్స్ ప్లాజా వద్ద నుంచి ప్రారంభమై, నెక్లెస్ రోడ్ మీదుగా, హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ వద్దకు చేరుకుని ముగిసింది. ఈవీలను ప్రోత్సహించేందుకే ఈ ర్యాలీ నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 5 నుండి 11 వరకు జరిగే హైదరాబాద్ ఇ-మొబిలిటీ వీక్‌లో నెక్స్ట్- జెన్ EV టెక్నాలజీస్ & ఇన్నోవేషన్ సంస్థ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్వహించింది.
ఫిబ్రవరి 11న హుస్సేన్ సాగర్ వద్ద FIA ఫార్ములా E రేస్ ప్రారంభమవుతుంది. మెక్లారెన్, మసెరటి, పోర్షే, జాగ్వార్, నిస్సాన్, మహీంద్రా రేసింగ్ సహా 22 కంపెనీల కార్లతో 11 జట్లు పాల్గొంటాయి. ఇందులో జెన్ 3 ఎరా ఫార్ములా E కారుప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ కారు గరిష్ట వేగం 322కి.మీ. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, తేలికైన, అత్యంత శక్తివంతమైన, సమర్థవంతమైన ఎలక్ట్రిక్ రేస్ కారుగా ఇది గుర్తింపు పొందింది.
వారం రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో టాప్ గ్లోబల్, దేశీయ కంపెనీలు నెక్స్ట్-జెన్ ఎలక్ట్రిఫికేషన్ టెక్నాలజీలు, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్‌లు, సొల్యూషన్స్‌ను కూడా ప్రదర్శించనున్నారు. పెరిగిపోతున్న కాలుష్యం, పర్యావరణ సమస్యల నుంచి భూమిని కాపాడేందుకు ఐక్యరాజ్యసమితి కంకణం కట్టుకుంది. అందుకే పలు దేశాల్లో కాలుష్యం తగ్గించేందుకు యూఎన్వో కృషి చేస్తుంది.
ఇందులో భాగంగా 2026 నాటికి ఉద్గారాలను తగ్గించుకునేందుకు అనేక దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున తీసుకురావాల్సి ఉంటుంది. పలు దేశాలు ఈవీలను ప్రోత్సహించేందుకు పన్ను రాయితీలు ఇస్తున్నాయి. మన దేశంలోనూ గడచిన రెండు సంవత్సరాల్లో 40 లక్షల ఈవీలు రోడ్లపైకి వచ్చాయి. రాబోయే 5 సంవత్సరాల్లో మరో 2 కోట్ల ఈవీలు రోడ్లెక్కే అవకాశం ఉంది. రాబోయే 15 సంవత్సారాల్లో 90 శాతం ఈవీలే ఉండనున్నాయి. ఇందుకు అవసరమైన పాలసీని కేంద్రం ప్రకటించింది.