తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం రైతుబంధు. రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.10 వేలు డబ్బులు అందజేస్తున్నారు. నేరుగా రైతుల ఖాతాల్లో ఈ నగదును బదిలీ చేస్తుంది ప్రభుత్వం. తాజాగా యాసంగికి సంబంధించి మరిన్ని నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
కాగా డిసెంబర్ చివరి వారం నుండి రైతుబంధు నిధులు జమ చేస్తుంది ప్రభుత్వం. మొదట ఎకరం నుండి పెంచుకుంటూ అందరి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు రైతులందరి ఖాతాల్లో నగదు జమ అయింది. మరికొంతమందికి రైతుబంధు ఇవ్వాల్సి ఉండగా అందుకు సంబంధించి మరికొన్ని నిధులను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది.
కొత్తగా పాస్బుక్లు పొందిన రైతుల డేటా సీసీఎల్ఏ నుంచి తమకు అందలేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అందులో పట్టాదారు పాస్ బుక్ నెంబర్, రైతు పేరు ఉంటుంది. సీసీఎల్ఏ నుంచి డేటా వస్తేనే.. నిర్ణీత ఫార్మాట్లో రైతు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అప్లోడ్ చేసి.. డబ్బులను జమ చేస్తామని తెలిపారు. మరికొన్ని రోజుల్లో రైతుబంధు నగదు జమ పూర్తి కానుంది. మరి కొత్త పాస్ బుక్ లు వచ్చిన వారికి పెట్టుబడి సాయం అందుతుందో లేదో చూడాలి.