GHMC IMPOSES RS 2O LAKHS FINE FOR BJP AND 3 LAKHS FOR TRS FOR SETTING UP ILLEGAL FLEXIES BANNERS IN HYDERABAD SK
Hyderabad: ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు.. బీజేపీ, టీఆర్ఎస్ నేతలకు భారీగా ఫైన్లు... ఏ పార్టీకి ఎంతంటే?
Hyderabad: హైదరాబాద్‌లో ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. కాషాయ, గులాబీ రంగుల్లో అన్ని చోట్లా వెలిశాయి. ఐతే ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లపై జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్ అయ్యారు. బీజేపీ నేతలతో పాటు గులాబీ నాయకులకూ భారీగా జరిమానాలు విధించారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. కాషాయం, గులాబీ వర్ణాల హోర్డింగ్‌లతో అన్ని రోడ్లు నిండిపోయాయి. జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం బీజేపీ, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటన సందర్భంగా టీఆర్ఎస్.. పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి.
2/ 6
రెండు కార్యక్రమాలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరు పార్టీలు.. నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, బిల్ బోర్డులను ఏర్పాటు చేశాయి. కొన్ని చోట్ల ఒక పార్టీకి చెందిన ఫ్లెక్సీలను తొలగించి.. వేరొక పార్టీకి చెందిన ఫ్లెక్సీలను పెట్టారు.
3/ 6
నగరవ్యాప్తంగా మెట్రో పిల్లర్స్‌పై రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార ఫ్లెక్సీలను టీఆర్ఎస్ ఏర్పాటు చేశారు. ఐతే చైతన్య పురి ప్రాంతంలో ఆయా ఫ్లెక్సీలపై .. బీజేపీ నేతలు మోదీ సభకు సంబంధించిన ఫ్లెక్సీలను అతికించారు.
4/ 6
ఇలా ఫ్లెక్సీల విషయమై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా మొదట మీరే బిల్ బోర్డు ఏర్పాటు చేశారని.. అందువల్లే తాము ఫ్లెక్సీలను పెట్టాల్సి వచ్చిందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
5/ 6
నగరవ్యాప్తంగా వెలిసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లలో కొన్నింటికి జీహెచ్ఎంసీ అనుమతి ఉంది. మరికొన్నింటికి మాత్రం ఎలాంటి అనుమతులు లేవు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ యంత్రాంగం రంగంలోకి దిగి.. రెండు పార్టీలకు భారీగా జరిమానాలు విధించింది.
6/ 6
శనివారం సాయంత్రం వరకు బీజేపీ నేతలకు రూ.20 లక్షలు, టీఆర్ఎస్ నాయకులకు రూ.3 లక్షలు జరిమానా విధించినట్లు జీహెచ్ఎంసీకి చెందిన ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు.