కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సకల ప్రోటోకాల్స్ ను కాలరాశారని, సమైక్య రాష్ట్రంలో ఉన్న స్వేచ్చ కూడా ఇప్పుడు లేకుండా పోయిందని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ ప్రజల తీర్పుతో సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగిందన్న ఈటల.. సీఎం మాటలోగానీ, పాలనలోగానీ ఏమాత్రం నిజాయితీ లేదని మండిపడ్డారు.
వరి సాగు విషయంలో కేసీఆర్ చెబుతున్నదంతా వాస్తవాం కాదని, నోరు చించుకుని మాట్లాడినంత మాత్రాన కేసీఆర్ కరెక్ట్ అయిపోడని, బిగ్గరగా అరిచినంత మాత్రాన తప్పు చేయనట్లు కాదని ఈటల అన్నారు. తెలంగాణలో పండే వడ్లను కేంద్ర ప్రభుత్వం కొంటుందని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్ ఘనతగా చెప్పుకుంటోన్న రైతువేదికలు పశువులు కట్టేసే షెడ్లలా మారాయని ఈటల మండిపడ్డారు.
హుజూరాబాద్ ఓటర్ల తీర్పుతో దిమ్మతిరిగిన తర్వాత కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడంలేదని, ప్రెస్ మీట్ల పేరుతో రెండు గంటలపాటు కేసీఆర్ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఈటల ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ షాక్ తర్వాత రాబోయే ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజలూ ఇవ్వబోయే తీర్పునకు కూడా కేసీఆర్ సిద్దంగా ఉండాలన్నారు.
గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం అసెంబ్లీలోకి వెళ్లిన ఈటలతో అసెంబ్లీలోని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఈటల వెంట బీజేపీ నేతలు వివేక్, జితేందర్ రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులున్నారు. మాజీ ఎంపీ కొండా వివ్వేశ్వర్ రెడ్డి కూడా ఈటల ప్రమాణానికి వచ్చారు.
సీఎం కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు సవాలుగా భావించిన హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై ఏకంగా 24వేల పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. తెలంగాణలో అన్ని వర్గాలూ తమవాడిగా చెప్పుకునే ఈటలను ముఖ్యమంత్రి అభ్యర్థిగానూ బీజేపీ ప్రకటించే అవకాశాలున్నాయని టాక్.