దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ భారతి హెళ్లీకేరి తెలిపారు. సిద్దిపేట ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలోని డీ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సోమవారం సాయంత్రం కలెక్టర్ పరిశీలించారు. మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగియనుంది.
ఈటీపీబీఎస్- సర్వీసు ఓటరు-పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. అరగంట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఉదయం 8.30 గంటలకు ఈవీఏం మిషన్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. ప్రతి రౌండ్ కు సంబంధించిన కౌంటింగ్ వారీగా ఎంట్రీలు చేపట్టనున్నట్లు వివరించారు. అదే విధంగా బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు వీడియో గ్రఫీ చేస్తున్నామని, కౌంటింగ్ కేంద్ర ఆవరణలో మీడియా రూమ్ ఏర్పాటు చేసి రౌండ్ వారీగా కౌంటింగ్ వివరాలు ఎప్పటికప్పుడు అందజేయనున్నట్లు చెప్పారు.
తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై చాలా ఉత్కంఠ నెలకొంది.ఇక్కడ 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాత, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కత్తి కార్తీక బరిలో ఉన్నారు.