ప్రస్తుతం కొందుర్గు వీఆర్వోగా పనిచేస్తున్న అనంతయ్య.. గతంలో దత్తాయిపల్లి గ్రామ వీఆర్వోగా పనిచేశారు. దత్తాయిపల్లికే చెందిన రైతు మామిడిపల్లి చెన్నయ్య.. తన పంట పొలాన్ని ఆన్లైన్ రిజిస్టర్ చేయించాలనుకున్నాడు. మొత్తం 12 ఎకరాల పొలంలో 9.7 ఎకరాలు ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో చెన్నయ్య కుమారుడు భాస్కర్ అనంతయ్యను సంప్రదించాడు. అనంతయ్య ఎకరానికి రూ.30వేలు చొప్పున లంచం తీసుకుని గత నెల 18న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేశాడు.
అయితే ఈ నెల 24న ఆన్లైన్ నుంచి ఆ రికార్డును తొలగించినట్టు కనిపించింది. దీంతో మళ్లీ అనంతయ్యను ఆశ్రయించగా ఈసారి ఎకరానికి లక్ష చొప్పున రూ.9లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో భాస్కర్ రూ.8లక్షలకు డీల్ సెట్ చేసుకున్నాడు. అనంతరం నేరుగా ఏసీబీ అధికారులను కలిసి.. వారిని అనంతయ్య ఇంటికి తీసుకెళ్లాడు. అనంతయ్య ఇంటి బయటే వేచివున్న అధికారులు.. అతను సరిగ్గా లంచం పుచ్చుకుంటున్న సమయంలో పట్టుకున్నారు.