అన్ని మతాలు, కులాలను ఆదరించే దేశం మనదని.. కొందరు మాత్రం కులం, మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. అది క్యాన్సర్ జబ్బులాంటిదని.. ఒకసారి వస్తే చాలా ప్రమాదకరమని చెప్పారు. అన్ని కులాలు, మతాలను ఆదరించే పరిస్థితిని చెడగొడితే ఎటూ కాకుండా పోతామని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో వైద్య విధానాన్ని పటిష్ట పరిచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, పేదరకం కారణంగా ప్రజలు వైద్యానికి దూరం కాకూడదని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఎండీఏ పరిధిలో 1.64కోట్ల జనాభా ఉందని, గాంధీ, ఉసాన్మియా కాకుండా మరో నాలుగు భారీ మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ పరిధిలో మూడు టిమ్స్ ఆస్పత్రులకు కేసీఆర్ భూమిపూజ నిర్వహించారు. ఎల్బీనగర్ (గడ్డి అన్నారం పండ్ల మార్కెట్), సనత్‌నగర్ (ఎర్రగడ్డ ఛాతి దవాఖాన), అల్వాల్ (బొల్లారం)లో నూతనంగా నిర్మించనున్న టిమ్స్ భవనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అల్వాల్‌లో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు.
సిటీలో కొత్తగా నిర్మించబోయే మూడు టిమ్స్ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని, 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు. అల్వాల్ టిమ్స్‌లో ప్రసూతి సేవల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారులు వచ్చినా ఒత్తిడి తట్టుకునేలా ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రులను రూపొందిస్తున్నామన్నారు.
కులమతాల పేరుతో రాజకీయాలు చేసే వారిని ప్రజలు గమనించాలన్న కేసీఆర్.. మన దేశానికి చెందిన సుమారు 13కోట్ల మంది విదేశాల్లో పనిచేస్తున్నారని, అక్కడి ప్రభుత్వాలు వాళ్లని వెనక్కి పంపితే వారికి ఉద్యోగాలు ఎవరివ్వాలి? అని ప్రశ్నించారు. ఈ ఏడేళ్లలో హైదరాబాద్‌లో 2.30లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, 10 నుంచి 15లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలిగాయని గుర్తుచేశారు.
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో 14వేల ఎకరాల్లో ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామన్న కేసీఆర్.. ప్రపంచానికే వ్యాక్సిన్ల రాజధానిగా హైదరాబాద్ నిలిచిందని తెలిపారు. దేశవిదేశాల వాళ్లు ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రశాంతమైన వాతావరణం లేకపోతే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా? అని ప్రశ్నించారు.
మతం, కులం పేరుతో కొట్లాటలు, కర్ఫ్యూలు ఉంటే పెట్టుబడులకు ఎవరూ ముందుకు రారు. అలాంటి క్యాన్సర్ మన దగ్గర తెచ్చుకోవద్దు. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. తాత్కాలికంగా అవి గమ్మత్తుగా అనిపించినా శాశ్వత ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి ఆస్కారం ఇవ్వొద్దు.. అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
పసికూన రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని, గుజరాత్, మహారాష్ట్ర తదితర పెద్ద రాష్ట్రాల కంటే తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని, తెలంగాణ తరహా పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని సీఎం అన్నారు. ఇండియాలో కరెంట్ ఉంటే వార్త.. తెలంగాణలో కరెంట్ పోతే వార్త. గుజరాత్లో రైతులు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తున్నారని గులాబీ బాస్ గుర్తుచేశారు.
మిషన్ భగీరథతో మంచినీటి కొరత తీర్చుకున్నామని, సాగునీటి రంగంలో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నామన్న కేసీఆర్.. వైద్యం, విద్యపై రాబోయే రోజుల్లో దృష్టి పెట్టబోతున్నామని స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతోనే ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రజల దీవెన ఇదేవిధంగా కొనసాగి, తెలంగాణ మరింత పచ్చబడాలని ఆకాంక్షించారు. దుష్టశక్తుల బారి నుంచి ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని ముందుకెళ్తామని కేసీఆర్ అన్నారు.