ఈ సంధర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..మానవ సమాజానికి సామాజిక సమతా సూత్రాన్ని ధార్మిక విలువలతో
కూడిన శ్రీరామానుజాచార్యుల బోధనలకు వెయ్యేండ్ల తరువాత తెలంగాణ రాష్ట్రం కేంద్రం కావడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ప్రపంచానికి సమతా దార్శనికుడైన శ్రీ రామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని హైదరాబాదులో స్థాపించడం అద్భుతమని ఆన్నారు.
పర్యాటకులకే కాకుండా మానసిక ప్రశాంతత కోరుకునే ప్రతీ ఒక్కరికీ ఇది ప్రశాంత నిలయంగా మారుతుందనీ సీఎం అన్నారు. సమతా మూర్తి విగ్రహ స్థాపన దేశం గర్వించదగిన గొప్ప నిర్మాణానమనీ ఆన్నారు. సమానత్వం కోసం శ్రీరామానుజాచార్యులు తెలిపిన ప్రవచనాలను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో నిబద్ధతతో అనుసరించడం గొప్ప విషయమని సీఎం అన్నారు.
హిందూ ధర్మాన్ని అనుసరించే ఆధ్యాత్మిక భక్తులకు, ధార్మికులకు ముచ్చింతల్ లో సకల వసతులను సమకూర్చడం సంతోషకరమని, ఈ పుణ్యక్షేత్రం భవిష్యత్తులో మరింత సుందర మనోహర భక్తిపారవశ్యం నింపే దివ్యక్షేత్రంగా అలరారనున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. అనతికాలంలోనే ఈ సమతామూర్తి వేదిక ప్రపంచ ధార్మిక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా విశేష ప్రాచుర్యం పొందనున్నదని సీఎం తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా శ్రీరామానుజాచార్యులవారికి ఉన్న కోట్లాది మంది భక్తులకు భారతదేశంలో మరో అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ ప్రాంతం వర్థిల్లనున్నదని సీఎం అన్నారు. స్ఫూర్తిస్థలి అయిన తెలంగాణ గడ్డ మీద ఆరంభమవుతున్న శ్రీరామానుజుల వారి సమతా స్ఫూర్తిని అందుకొని తెలంగాణ ముందుకు సాగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.