ములుగు జిల్లా రామన్నగూడెం దగ్గర గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. దీంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏటూరు నాగారం మండలం, రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర 18.600 మీటర్ల మేర గోదావరి ప్రవాహం ఉంది.
వర్షాలు, గోదావరి వరదనీటితో ఏటూరు నాగారం మండలము ముల్లకట్ట బ్రిడ్జి నీటి ప్రవాహం ఎక్కువ కావడం వల్ల వందల ఎకరాలు నీట మునిగి రైతులు నష్టపోతున్నారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని స్థానిక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి రోహీర్ గ్రామంలో వంప్పుగూడెం ఎస్సీ కాలనీలోకి వరదనీరు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంతవరకు ఏఒక్క అధికారి, ప్రజాప్రతినిధి తమగోడు పట్టించుకోలేదని కేవలం హెచ్చరికలు మాత్రమే జారీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శిస్తున్నారు.
రామన్నగూడెం పుష్కర ఘాట్ పనుల కోసం కోట్లు కేటాయించిన కాంట్రాక్టర్లు నాణ్యత లేకుండా నిర్మించడం వల్ల గోదావరి వరద నీరు రామన్నగూడెం గ్రామంలోకి చేరిందని..చుట్టూ ఉన్న వేలాది ఎకరాలు నీట మునిగాయని రైతులు ఆరోపిస్తున్నారు. వెంటనే రైతులకు పరిహారంతో పాటు వరద బాధితులకు పునరావసంతో పాటు నిత్యావసరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.