మొట్టమొదటి సారిగా నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్ స్పైర్ అవార్డ్స్, మానక్ ప్రదర్శన 2023 అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయ శాఖ మంత్రి అల్లోల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు.
గత ఏడాది తెలంగాణకు చెందిన ఎనిమిది ఉత్తమ ప్రదర్శనలుగా ఎంపికవ్వటం ఎంతో గొప్ప విషయం అని, ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి అభినందించారు. మన విద్యార్థులు అంతర్జాతీయ వేదికలపై జపాన్, కంబోడియా దేశాలలో పాల్గొని సత్తా చాటారని అన్నారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లిన రాణించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు.
సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. 50వ రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీలకు మంత్రి సబిత ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడకు వచ్చిన విద్యార్థులు జిల్లా స్థాయిలో ఉత్తములుగా ఉండి రాష్ట్ర స్థాయికి వచ్చారని, ఇక్కడ నుండి జాతీయ స్థాయికి వెళ్ళాలని మంత్రి ఆకాంక్షించారు.
రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ..ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంగా మార్పులు వస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకొని విద్యార్థులు రాణించాలని పిలుపునిచ్చారు. మూడు దశాబ్దాలుగా టెక్నాలజీ పరంగా అనేక మార్పులు వచ్చాయని, విద్యార్థి దశలోనే మెదడుకు పదును పెడితే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు.
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు వస్తున్నాయని, ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులుగా మారి ఆధునిక పద్ధతుల్లో బోధిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్య సంచాలకులు దేవసేన, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయ లక్ష్మీ, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ముథోల్, ఖానాపూర్ శాసన సభ్యులు జి. విఠల్ రెడ్డి, రేఖా నాయక్ తదితరులు పాల్గొన్నారు.