Art Exhibition: ఒకే బొమ్మలో అనేక చిత్రాలు .. ఆకట్టుకుంటున్న ఆర్ట్ ఎగ్జిబిషన్
Art Exhibition: ఒకే బొమ్మలో అనేక చిత్రాలు .. ఆకట్టుకుంటున్న ఆర్ట్ ఎగ్జిబిషన్
Art Exhibition:ఒకే బొమ్మలో అనేక చిత్రాలు కనిపించేలా బొమ్మలు గీయడంలో ఆయనది అందెవేసిన చేయి.తెలంగాణ ప్రాంతంలో జరిగే బోనాల ఉత్సవం, శివసత్తులు, పోతరాజుల నృత్యాన్ని ఆయన బొమ్మల్లో చిత్రీకరించారు. ఇప్పటి వరకు అనేక మందితో ప్రశంసలు అందుతున్న ఈ ఫోటోలు ఇప్పుడు ఆదిలాబాద్లో ప్రదర్శనకు ఉన్నాయి.
1/ 10
ఒకే బొమ్మలో అనేక చిత్రాలు కనిపించేలా బొమ్మలు గీయడంలో ఆయనది అందెవేసిన చెయి. ఆయన మరెవరో కాదు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన చేయి తిరిగిన చిత్రకారుడు అన్నారపు నరేందర్.
2/ 10
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. అన్నారపు నరేందర్ గీసిన అపురూపమైన చిత్రాలు సందర్శకులకు సరికొత్త అనుభూతులను పంచింది. లయన్స్ క్లబ్ సౌజన్యంతో చిత్రకారుడు అన్నారపు నరేందర్ ఏర్పాటు చేశారు.
3/ 10
ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ పి.ఎస్. రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఆర్ట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచిన బొమ్మలను సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా విద్యార్థులు, ఛాత్రోపాధ్యాయులు, పట్టణానికి చెందిన కవులు, రచయితలు, కళాకారులు నరేందర్ చిత్రాలను ఆసక్తిగా తిలకించారు.
4/ 10
ఒక్కొక్క చిత్రంలో అంతర్లీనంగా దాగి ఉన్న భావాలను చిత్రకారుడు నరేందర్ తన చేతిలో ఆ బొమ్మ రూపుదాల్చిన క్రమాన్ని సందర్శకులకు వివరించారు. తెలంగాణ ప్రాంతంలో జరిగే బోనాల ఉత్సవం, శివసత్తులు, పోతరాజుల నృత్యాన్ని ఆయన బొమ్మల్లో చిత్రీకరించారు.
5/ 10
వినాయకుడు వంటి దేవతామూర్తులను, భక్తుల పారవశ్యాన్ని ఎంతో పదిలంగా తన చిత్రాల్లో పొందుపరిచారు. స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను గీసి సందర్శకుల్లో స్పూర్తిని నింపారు. ముఖ్యంగా భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వంటి వీరుల అమరత్వాన్ని అద్భుతంగా తన చిత్రాల్లో బహుముఖీన పద్దతిలో చిత్రీకరించారు.
6/ 10
బతుకమ్మ వైభవం, తెలంగాణ పోరాటం, సాంస్కృతిక చైతన్యం తన రంగుల చిత్రాల్లో పొందుపరిచారు. ఇంకా పలు రకాల సంగీత వాయిద్యాలను పలికిస్తున్న వ్యక్తుల బొమ్మలను తనదైన శైలిలో చిత్రీకరించారు.
7/ 10
నరేందర్ చిత్రకళలో పికాసో క్యూబిజం ఛాయలు కనిపిస్తాయని ఈ ప్రదర్శనను తిలకించేందుకు వచ్చిన రచయిత, పరిశోధకుడు సుమనస్పతిరెడ్డి అన్నారు. అయితే తన వర్ణ చిత్రాల్లో క్యూబిజంతోపాటు జామెట్రికల్ ఫాం ఉంటుందని చిత్రకారుడు అన్నారపు నరేందర్ తెలిపారు.
8/ 10
ఇప్పటి వరకు ఎక్కడెక్కడో ప్రదర్శనలు నిర్వహించిన తాను తన స్వస్థలమైన ఆదిలాబాద్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించడం ఎంతో సంతృప్తిని కలిగించిందని అన్నారు.
9/ 10
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పుట్టి పెరిగిన అన్నారపు నరేందర్ ఇంటర్మీడియెట్ తర్వాత హైదరాబాద్లోని జేఎన్టీయులో బి.ఎఫ్.ఎ పూర్తి చేశారు. అనంతరం మైసూర్లో ఎం.ఎఫ్.ఏ పూర్తి చేశారు.
10/ 10
ఇప్పటి వరకు అన్నారపు నరేందర్ హైదరాబాద్, బెంగుళురు, మైసూర్, ముంబాయి, జైపూర్ వంటి నగరాల్లో నిర్వహించిన ఆర్ట్ ఫెస్టివల్స్, ఆర్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహించారు. పలువురు మేధావులు, కళాభిమానులు ప్రశంసలను అందుకున్నారు.