Bhatti Vikramarka: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బిజెపి, బిఆర్ఎస్ రెండు తోడు దొంగలే అని సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క విమర్శించారు. పేపర్ లీకేజీతో నిరుద్యోగుల ఆశలను నిండా ముంచారని మండిపడ్డారు. టిఎస్పిఎస్పి చైర్మెన్, సభ్యులు, కార్యదర్శిలను తొలగించాలని ఈ సందర్బంగా భట్టి డిమాండ్ చేశారు.
భారత్ జోడో కొనసాగింపుగానే హాథ్ సే హాథ్ పాదయాత్ర అని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర నాల్గవ రోజు ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఇంద్రవెల్లి మండల కేంద్రం నుంచి మొదలై ఈశ్వర్ నగర్, పులిమడుగు, కుమ్మరి తాండ, ఎక్భాల్ పూర్, శ్యాంపూర్, ఉట్నూర్ క్రాస్ రోడ్డు వరకు కొనసాగింది.
దాదాపుగా 18 కిలోమీటర్లు మేర కొనసాగిన పాదయాత్రలో దారి పొడవున ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చి తమ గోడును వెల్లబోసుకున్నారు. పాదయాత్రలో భాగంగా ఇంద్రవెల్లిలో కొలిమి పని చేసుకునే లక్ష్మణ్ ఇంటికి వెళ్లి ఆయన కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. మాకెలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పారు. కాసేపు కొలిమి చక్రాన్ని తిప్పి వారు పడుతున్న కష్టంతో వస్తున్న ఆదాయం గురించి ఆరా తీశారు.
రోజుకు 200 మాత్రమే వస్తుందని తనకు ఐదుగురు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు ఉన్నాడని బతకలేకపోతున్నామని చెప్పారు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి రుణం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. మీకు అన్ని పథకాలు వచ్చేలా చేస్తానని, నువ్వు మాత్రం పిల్లల్ని బాగా చదివించు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నీకు ఇల్లు కట్టించే బాధ్యత నాది అని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.