తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందే ఆత్మగౌరవం కోసమని, గిరిజనులను అడవుల నుండి వెళ్ల గొట్టి వారి ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పీపుల్స్ మార్చ్ పోరు యాత్రలో భాగంగా ఆరవ రోజైన మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో కొనసాగింది.
ఏ ఊర్లో చూసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాలేదని, పింఛన్లు ఇవ్వడం లేదని..మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, నాసిరకమైన రేషన్ బియ్యం తినడం వల్ల కడుపునొప్పి వస్తున్నదని చెప్పుకొచ్చారు. అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ కూడా రావడం లేదని, వైద్యం అందడం లేదని, పీజీ చదివినా ప్రభుత్వ ఉద్యోగం దొరకడం లేదని, ప్రతి గ్రామంలో అటవీ అధికారులతో తలెత్తుతున్న ఇబ్బందులు, అడవిలోకి రానివ్వడం లేదని ఇలా ఎన్నో సమస్యలను పాదయాత్రకి ఎదురొచ్చి జనాలు భట్టి దృష్టికి తీసుకువచ్చారు.
తెలంగాణ తెచ్చుకుందే ఆత్మగౌరవం కోసమని, అడవి నుంచి వెళ్లగొట్టి గిరిజనుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. గిరిజనుల బతుకులు మార్చడానికి కాంగ్రెస్ హయాంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు. ధనిక రాష్ట్రంలో అధికార ప్రభుత్వం ఐటీడీఏలను నిర్వీర్యం చేసి గిరిజనుల బతుకులను అల్లకల్లోలం చేస్తున్నదని విమర్శించారు.