Bhatti Vikramarka: ప్రజలను అప్యాయంగా పలకరిస్తూ…సమస్యలను వింటూ…సిఎల్పి నేత భట్టి విక్రమార్క రెండవ రోజు పీపుల్స్ మార్చ్ కొనసాగింది. ఈ పాదయాత్రలో ఆయా గ్రామాల ప్రజలు భట్టి విక్రమార్కను కలిసి సమస్యలను ఏకరువు పెట్టారు. వారికి స్వాంతన చేకూరుస్తూ భట్టి ముందుకుసాగారు. అడుగడుగున ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పోరుయాత్ర రెండవ రోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం నుండి సిరికొండ గ్రామం వరకు కొనసాగింది. భట్టి విక్రమార్క మండలంలోని దుబార్ పేట్, పట్వారి గూడెం, మాదాపూర్, పొన్న, రాయిగూడ, సుంకిడి, జాకీర్ గూడా మీదుగా సిరికొండ వరకు మొత్తం 17 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
భట్టి విక్రమార్క తన పాదయాత్రలో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇచ్చోడ బస్టాండ్ వద్ద రోడ్డు పక్కన చెప్పులు కుడుతున్న కార్మికుని వద్దకు వెళ్లి ఆయన సమస్యలు అడిగారు. 9వ తరగతి వరకు చదువుకున్న తనకు ఎలాంటి ఉపాధి అవకాశం లేకపోవడంతో రోడ్డు పక్కన ఇలా చెప్పులు కుడుతూ కుటుంబాన్ని సాకుతున్నానని వెల్లడించాడు.
ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందిందా అని అడగగా ఇప్పటివరకు తనకు ఎలాంటి సహకారం అందలేదని, ఉండడానికి కూడా సొంత ఇల్లు లేదని తన పరిస్థితిని వెలిబుచ్చాడు. ప్రభుత్వం ముద్ర లోన్ ఇస్తుంది కదా అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆయనను అడగగా ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టుకున్న తనకు రాలేదని చెప్పులు కుట్టే కార్మికుడు బాలాజీ ఈశ్వర్ ముకుంద్ చెప్పారు.
రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న షేక్ మొహిష్ పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్కకు ఎదురొచ్చి తన దుకాణం వద్దకు తీసుకువెళ్లి తన దీన పరిస్థితిని వెలిబుచ్చాడు. సమస్యలు తీర్చడానికే ఈ పాదయాత్ర. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ పీపుల్స్ మార్చ్ పోరుయాత్ర చేపట్టినట్టు సిఎల్పి నేత భట్టి విక్రమార్క తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఈ యాత్ర రెండవ రోజు ఇచ్చోడ మండల కేంద్రం నుండి సిరికొండ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని, ఆత్మగౌరవం దక్కుతుందని పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే, ప్రజల సమస్యల పరిష్కరించకుండా కెసిఆర్ ప్రజలను అగ్నిగుండంలోకి నెట్టివేశారని అన్నారు.
తెలంగాణ వస్తే మరిన్ని మంచి పథకాలు వస్తాయని ఆశించిన ప్రజలను కెసిఆర్ ఉన్న పథకాలు తీసివేసి గోసపెడుతున్నారని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి అనేక మాయమాటలు చెప్పిన సీఎం కేసీఆర్ హౌజింగ్ శాఖను ఎత్తివేసి ప్రజలను దగా చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి పోడు భూముల పట్టాలు పంపిణీ చేయకుండా గిరిజనులను వేధించి కేసులు పెట్టడానికేనా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నదని ప్రశ్నించారు.
సిఎల్పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పోరుయాత్రకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్ది సంఘీభావం ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో భట్టి విక్రమార్కతో కలిసి జీవన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వ్యాప్తంగా భట్టి విక్రమార్క చేపట్టే పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.