ఆదివాసి గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా ఆలయ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండున్నర కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ల్ వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో నిర్వహించిన దర్భార్ లో మంత్రులు ఇద్దరు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ..నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మేస్త్రం వంశీయులు నూతన ఆలయ గర్భగుడిని 5 కోట్లతో నిర్మించడం అభినందనీయమని అన్నారు. పర్యాటక ప్రదేశంగా ఏర్పాటుకు ఆలయ ప్రాంగణంలో ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం 12.50 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు.
జల్, జంగల్, జమీన్ కోసం పోరాడి కొమరం భీమ్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలోనే గిరిజనులు సాగు చేసుకుంటున్నా అటవీ భూములకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను మంజూరు చేస్తామని తెలిపారు. జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు.
ఏజెన్సీ ప్రాంతాలలోని గూడాలు, తాండాలు అభివృద్ధి చెందేలా పరిసరాల పరిశుభ్రత, రహదారుల నిర్మాణం, హరితహారం, డంపింగ్ యార్డ్, స్మశాన వాటికలు నిర్మించుకోవడం జరిగిందన్నారు. ఉట్నూరు ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గిరిజన విద్యార్థులకు విదేశీ విద్య అభ్యసించేందుకు 20 లక్షలు మంజూరు చేస్తున్నామన్నామని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని వివరించారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ..ప్రపంచంలోనే అతిపెద్ద జాతరలో నాగోబా జాతర ఒకటని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి గిరిజన నాగోబా దర్బార్ ను నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల ప్రజల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని వివరించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వసతి సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలలోని రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు 340 కోట్లను మంజూరు చేయడం జరిగిందని, త్వరలోనే పనులను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటిలో సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటిడిఎ పిఓ వరుణ్ రెడ్డి గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పీఠాధిపతి వేంకటరావు, ఎమ్మెల్యేలు రేఖా శ్యాంనాయక్, రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్లు రాథోడ్ జనార్ధన్,కోవ లక్ష్మి, ఎమ్మెల్సీలు దండే విట్టల్, రాఘోత్తం రెడ్డి, ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరి భాయ్, ఆదిమ గిరిజన సలహా మండలి అధ్యక్షులు లక్కే రావు, డిసిసిబి చైర్మన్ అడ్డి బోజారెడ్డి, మాజీ ఎంపీ నగేష్, జడ్పిటిసి చారులత, ఎంపీపీ పుష్పలత, సర్పంచ్ రేణుక నాగనాథ్, మెస్రం వంశీయులు తదితరులు పాల్గొన్నారు.