మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫారం వాట్సాప్ (WhatsApp) మరో కొత్త ఫీచర్ (New Feature)ను అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలోనే ‘బ్లాక్’ (Block) ఫీచర్ షార్ట్‌కట్‌ను అందించే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతం బీటా యూజర్లకు ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. టెస్టింగ్ పూర్తయిన తర్వాత యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది? ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకవేళ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వ్యక్తులనే బ్లాక్ చేయాలంటే.. చాట్ విండోలో ఆ వ్య క్తి చాట్ పేజీ ఓపెన్ చేయాలి. తర్వాత కుడివైపు పైభాగంలో ఉన్న మూడు చుక్క లపై క్లిక్ చేస్తే మెనూ ఓపెన్ అవుతుంది. అక్కడ మోర్‌పై క్లిక్ చేస్తే బ్లాక్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఆ నంబర్ నుంచి ఇక ఎలాంటి మెసేజ్‌లు, కాల్స్ రావు.
* కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుందంటే? : వాట్సాప్ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్‌తో మరింత సులువుగా చాట్ పేజీ ఓపెన్ చేయకుండా అవతలి వారిని బ్లాక్ చేయవచ్చు. చాట్ విండోలో ఆ వ్యక్తి కాంటాక్ట్‌పై లాంగ్‌ప్రెస్ చేస్తే సెలెక్ట్ అయినట్లు చూపిస్తుంది. అనంతరం కుడివైపు పైభాగంలో ఉన్న మూడు చుక్క లపై క్లిక్ చేస్తే ఆప్షన్స్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో బ్లాక్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే యూజర్ బ్లాక్ లిస్ట్‌లోకి యాడ్ అవుతాడు. ఆ నంబర్ నుంచి ఎలాంటి మెసేజ్‌లు, కాల్లు రావు.
WABetaInfo తెలిపిన వివరాల మేరకు.. వాట్సాప్ కంపెనీ వినియోగదారులకు నోటిఫికేషన్లలోనే బ్లాక్ షార్ట్‌కట్‌ను అందిస్తుందని తెలిపింది. అయితే ప్రతిసారీ నోటిఫికేషన్లలో బ్లాక్ ఆప్షన్ కనిపించదని పేర్కొంది. కేవలం అన్నౌన్, అన్ ట్రస్డెడ్ కాంటాక్ట్స్ నుంచి మెసేజ్‌లు వచ్చినప్పుడు మాత్రమే నోటిఫికేషన్లో బ్లాక్ ఆప్షన్ కనిపిస్తుందని వివరించింది.
అన్నౌన్ కాంటాక్ట్స్‌కి మాత్రమే బ్లాక్ ఆప్షన్ కనిపించడం అవసరం. ట్రస్టెడ్ కాంటాక్ట్స్‌కి రిప్లై ఇస్తున్న సందర్భంలో పొరపాటున బ్లాక్ ఆప్షన్ క్లిక్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలను ఎదుర్కోకుండా అన్నౌన్ కాంటాక్ట్స్‌కి మాత్రమే కనిపించడం మేలు. వాట్సాప్ త్వరలో అందజేయనున్న అప్డేట్లలో ఈ బ్లాక్ ఫీచర్ షార్ట్‌కట్ అందుబాటులోకి వస్తుందని సమాచారం.