భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లదే హవా. గతంతో పోలిస్తే ప్రస్తుతం విద్యుత్ వాహనాలను వినియోగించే వారి శాతం చాలా మేరకు పెరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే చాలా వాహన సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. క్రీయాశీలకంగా వీటి కోసం పనిచేస్తున్నాయి. ఓ పక్క మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఈవీల తయారీలో వెనక్కి తగ్గడం లేదు ఆటో సంస్థలు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొన్ని విద్యుత్ వాహనాలను భారత మార్కెట్లో విడుదల కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఆడీ ఈ-ట్రాన్.. లగ్జరీ కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న ఆడీ కంపెనీ తన ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారును ఈ ఏడాదే లాంచ్ చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు ఈ-ట్రాన్ స్పోర్ట్స్ బ్యాక్ వేరియంట్ ను కూడా లాంచ్ చేయనుంది. ఈ కంపెనీ నుంచి భారత్ లో విడుదల కానున్న తొలి విద్యుత్ కారు ఇదే కావడం విశేషం. ఈ రెండు వేరింయట్లు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉండి 355 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 561 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా ఈ వాహనం సింగిల్ ఛార్జింగ్ తో 452 కిలోమీటర్ల ప్రయాణించే రేంజ్ ను కలిగి ఉంటుంది. ఇందులో 95 కిలోవాట్ అవర్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని పొందుపరచడం అదనపు ఆకర్షణ. రెగ్యూలర్ ఛార్జర్ తో దీన్ని చార్జ్ చేస్తే ఫుల్ కావడానికి ఎనిమిదన్నర గంటల సమయం పడుతుంది.
మహీంద్రా ఈకేయూవీ100.. ఈ సరికొత్త ఈవీకి సంబంధించిన ధరను కూడా ఇటీవలే ప్రకటించింది మహీంద్రా సంస్థ. ఎక్స్ షోరూంలో దీని ఖరీదు వచ్చేసి రూ.8.25 లక్షలుగా నిర్దేశించింది. 2020లో దిల్లీలో జరిగిన ఆటోఎక్స్ పోలో ఈ కారును ప్రదర్శించింది. 40 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన మోటార్ ను కలిగి ఉండి 53 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 120 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా సింగిల్ స్పీడ్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఫ్రంట్ వీల్స్ కు పవర్ ను ట్రాన్స్ ఫర్ చేస్తుంది. అంతేకాకుండా సింగిల్ ఛార్జింగ్ తో 120 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు.
మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఎస్.. ఈ వాహనం గురించి గత నెలలోనే అధికారికంగా ప్రకటించింది బెంజ్ సంస్థ. తన అధికారిక ఇండియా వెబ్ సైట్లో ఈ విద్యుత్ కారు గురించి వివరాలు తెలియజేసింది. మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఎస్ వాహనంలో రెండు మోడళ్లు రానున్నాయి. ఈక్యూఎస్ 450 ప్లస్, ఈక్యూఎస్ 580 4 MATIC అనే వేరియంట్లలో లభ్యమవుతుంది. ఈక్యూఎస్ 450 ప్లస్ బేస్ వేరియంట్ కాగా.. ఈక్యూఎస్ 480 4MATIC టాప్ వేరియంట్.
పోర్షే టైకాన్.. లగ్జరీ కార్లు కొనుగోలు చేయాలనుకునేవాళ్లు ఈ బ్రాండ్ కార్లను అస్సలు మర్చిపోరు. విలాసవంతమైన కార్ల ఉత్పత్తిలో ముందజలో ఉండే ఈ సంస్థ నుంచి త్వరలో సరికొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు భారత మార్కెట్లో రానుంది. అదే పోర్షే మిషన్ ఈ కాన్సెప్ట్. ఈ ఫ్యాన్సీ ఫోర్ వీలర్ రెండు సింక్రోనస్ మోటార్లను కలిగి ఉంటుంది. ఇది 600 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్ ను కలిగి ఉంటుంది. ఈ కారు కోసం వాహన ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇది 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.5 సెకండ్లలోనే అందుకుంటుంది.
టాటా ఆల్ట్రోజ్ ఈవీ.. ఈ కారును తొలిసారిగా 2019 జెనీవా మోటార్ షోలో ప్రదర్శించారు. ఆగిల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్సెడ్ ఆర్కిటెక్చర్(ALFA) ఆధారంగా ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ ను రూపొందిస్తున్నారు. ఈ కారులో అధునాతన జిప్ట్రాన్ పవర్టెయిన్ టెక్నాలజీని పొందుపరిచారు. అంతేకాకుండా లిథియం అయాన్ బ్యాటరీతో పాటు ఐపీ67 సర్టిఫికేషన్ తో అందుబాటులోకి రానుంది.
టెస్లా మోడల్ 3.. ఎలన్ మస్క్ కు చెందిన టెస్లా నుంచి రానున్న ఈ విద్యుత్ వాహనం భారత మార్కెట్లో త్వరలోనే విడుదల కానుంది. ముంబయిలో ఈ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఉండగా.. కర్ణాటకలో టెస్లా ప్రొడక్షన్ ప్లాంట్ ఉంది. ఎంతకాలం నుంచి ఈ సరికొత్త టెస్లా మోడల్ 3 ఈవీ కోసం వాహన ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సింగిల్ ఛార్జింగ్ తో 500 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అంతేకాకుండా 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.1 సెకండ్లలోనే అందుకుంటుంది.
వోల్వో XC40 రివేంజ్.. అక్టోబరు 2021లో ఈ సరికొత్త వోల్వో XC40 కారును భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ కారు సీబీయూ(completely built unit ) మోడల్ గా విపణిలో అడుగుపెట్టనుంది. ఇది డ్యూయల్ మోటార్ పవర్టెయిన్ తో కూడిన 150 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది 402 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 660 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.9 సెకండ్లలోనే అందుకుంటుంది.