అంతరిక్ష ప్రయోగాలకు 2023 అత్యంత కీలకమైనది. ఈ సంవత్సరం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA), భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) కీలక ప్రయోగాలు చేయబోతున్నాయి. చందమామ, శుక్రగ్రహంపై పరిశోధనతోపాటూ... ఓ గ్రహశకలానికి సంబంధించిన ప్రయోగం కూడా ఈ సంవత్సరం ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
PM1 : ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో.. నాసా.. తన మొదటి కమర్షియల్ స్పేస్ మిషన్‌ను చందమామ చెంతకు పంపబోతోంది. దీని పేరు పెరిగ్రిన్ మిషన్ వన్ (PM1). ఇందులో భాగంగా... రాకెట్ కొన్ని సైన్స్ పరికరాలతోపాటూ... ఐరిస్ రోవర్ (Iris Rover)ను చందమామపై దింపనుంది. ఇది మొదటి అమెరికా విద్యార్థి తయారుచేసిన, చందమామపై దిగబోతున్న రోవర్.
Osiris-Rex Mission : ఇది నాసా సెప్టెంబర్‌లో చేపట్టే మిషన్. 2016లో నాసా ఓ స్పేస్‌క్రాఫ్ట్‌ని బెన్ను (Bennu) గ్రహశకలం చెంతకు పంపింది. అది గ్రహశకలంపై మట్టిని సేకరించింది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఈ స్పేస్‌క్రాఫ్ట్ భూమిని చేరుతుంది. అది సేకరించిన మట్టిని పరిశీలించడం ద్వారా సౌర వ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలిసే వీలు ఉంటుందని నమ్ముతున్నారు.
Psyche Mission : ఇది నాసా అక్టోబర్‌లో చేపట్టబోయే ప్రాజెక్ట్. ఇందులో సైషీ మిషన్... సైషీ 16 గ్రహశకలాన్ని పరిశీలించనుంది. సాధారణంగా గ్రహశకలాలు.. రాళ్లు, మంచుతో తయారవుతాయి. సైషీ మాత్రం లోహాలతో తయారైనట్లు భావిస్తున్నారు. దీన్ని పరిశీలించడం ద్వారా.. భూమి కేంద్రంలో ఎలా ఉంటుందో, విశ్వ ఆవిర్భావ సమయంలో ఏం జరిగిందో తెలుస్తుంది అనుకుంటున్నారు.
JUICE : ఇది ఈ సంవత్సరం ఏప్రిల్‌లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) చేపట్టే ప్రయోగం. ఇందులో.. జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్ మిషన్.. గురుగ్రహం చెంతకు వెళ్తుంది. దాని చుట్టూ తిరిగే.. మంచుతో ఉన్న గనీమేడ్, కాల్లిస్టో, యూరోపో ఉపగ్రహాలను మూడేళ్లపాటూ పరిశీలిస్తుంది. 2015-2025 మధ్య ESA చేపట్టే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇదే.