రిలయన్స్ జియో, గూగుల్ భాగస్వామ్యంలో రూపొందిన జియోఫోన్ నెక్ట్స్ దీపావళికి లాంచ్ కానుంది. తొలుత వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబర్ 10న జియోఫోన్ నెక్ట్స్‌ను లాంచ్ చేయనున్నట్లు జియో, గూగుల్ ప్రకటించినప్పటికీ ఈ ఫోన్‌ను మెరుగ్గా అభివృద్ధి చేసి ఉత్తమ పనితీరుతో వినియోగదారుల మెప్పు పొందేలా చేసేందుకు మరికొంత సమయం పడుతుందని తెలిసింది.
ఇంటర్నెట్లో జియోఫోన్ నెక్ట్స్ గురించి తెగ సెర్చ్ చేశారు. అలాంటి వారు దీపావళి వరకూ వేచి చూడక తప్పదు. జియోఫోన్ నెక్ట్స్ 4జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ప్రస్తుతం రెండు కంపెనీలు టెస్టింగ్‌ను మొదలుపెట్టాయని.. దీపావళికి పూర్తి స్థాయిలో ఉత్తమమైన జియోఫోన్ నెక్ట్స్‌ను వినియోగదారులకు అందిస్తామని జియో, గూగుల్ ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
13 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో జియోఫోన్ నెక్ట్స్ తయారైందని.. 2500 ఎంఏహెచ్ సామర్థ్యంతో ఈ ఫోన్ పనిచేయనుందని ట్విట్టర్ లీకర్ చెప్పడం గమనార్హం. ఈ ఫోన్ ధర 3,499 రూపాయలుగా ఆ ట్విట్టర్ లీకర్ చెప్పుకొచ్చాడు. అయితే.. ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసేంత వరకూ ఈ ఫోన్ ఫీచర్లపై క్లారిటీ వచ్చేలా లేదు.