Women's day 2021: అంతరిక్ష పరిశోధనలకు పెట్టింది పేరు అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా (NASA). భారత మూలాలున్న ఎంతో మంది మహిళలు నాసాలో పనిచేస్తున్నారు. అక్కడి రకరకాల రంగాల్లో వారు తమ అమూల్య సేవలు అందిస్తున్నారు. అంతరిక్షంలో భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారిని ఓసారి గుర్తు చేసుకుందాం. (images credit - NASA, Wikipedia)
Sharmila Bhattacharya, Studying The Human Body In Space: నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్లో రీసెర్చ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న షర్మిల భట్టాచార్య... భారత సంతతికి చెందినవారు. భారతీయులకు నైజీరియాలో పుట్టిన ఆమె... ప్రిన్స్టన్ యూనివర్శిటీలో చదువుకున్నారు. అంతరిక్షంలో ప్రయాణించేటప్పుడు జన్యుపరంగా వచ్చే మార్పులు, రేడియేషన్ వంటి అంశాల్ని ఆమె పరిశోధిస్తున్నారు. (Image source: NASA)
Sunita Williams: నాసాలో రెండో ఇండో-అమెరికన్ వ్యోమగామి మన సునీతా విలియమ్స్. ఎన్నోసార్లు ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగరేశారు. ఓ మహిళా వ్యోమగామిగా ఆమె ఏకంగా 50 గంటల 40 నిమిషాలపాటూ స్పేస్ వాక్ చేసి... ప్రపంచంలో ఎక్కువ సేపు స్పేస్ వాక్ చేసిన మహిళగా గుర్తింపు పొందారు. భారత సంతతి వారికి అమెరికాలో పుట్టిన సునీతా విలియమ్స్... భారత మూలాలను మాత్రం ఏనాడూ మర్చిపోలేదు. అంతరిక్షానికి ఉపనిషత్తులు, భగవద్గీత గ్రంథాన్ని తీసుకెళ్లారు ఆమె. నాసా కమర్షియల్ మార్స్ మిషన్‌లో ఆమె ఇప్పుడు పనిచేస్తున్నారు. (Image source: NASA)
Kalpana Chawla: అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయురాలు కల్పనా చావ్లా. హర్యానాలో పుట్టిన ఆమె... నాసా వరకూ ప్రయాణం సాగించారు. కొలంబియా స్పేస్ షటిల్లో ఆమె రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్‌గా పనిచేశారు. 2003లో కొలంబియా స్పేస్ షటిల్లో భూమికి వస్తుండగా... పెను ప్రమాదం జరిగింది. మరో ఏడుగురు వ్యోమగాములతోపాటూ... ఆమె కూడా కన్నుమూశారు. 18 ఏళ్ల తర్వాత కూడా ఆమె ప్రపంచవ్యాప్తంగా యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు. చాలా మంది ఆమెను చూసి... వ్యోమగాములవ్వడమే తమ లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. (Image source: wikipedia)
Dr. Anita Sengupta: నాసాలో అత్యంత కీలకమైన జెట్ ప్రొపల్షన్ లేబరేటరీలో ప్రాజెక్టు మేనేజర్‌గా చేస్తున్నారు డాక్టర్ అనితా సేన్ గుప్తా. రోవర్లు ల్యాండ్ అయ్యేందుకు వీలైన ఏర్పాట్లు, వ్యవస్థను ఆమె రెడీ చేస్తున్నారు. 2012లో క్యూరియోసిటీ రోవర్ మార్స్‌పై చక్కగా దిగడానికి కారణం 70 అడుగుల ప్యారాచూట్. దాన్ని తయారుచేసిన వారు అనితే. ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి సంబంధించి... బోస్ ఐన్‌స్టీన్ కండెన్సేట్ అనే ప్రత్యేక స్టేట్ ఆఫ్ మేటర్ తయారుచేశారు. ఇలా ఎన్నో సైంటిఫిక్ మార్క్స్ ఆమె లిస్టులో ఉన్నాయి. (Image source: Astro Talk UK)
Dr. Madhulika Guhathakurta: ఇండియాలో పుట్టి... ఢిల్లీ, డెన్వర్, కొలరాడో యూనివర్శిటీల్లో చదివిన డాక్టర్ మధులికా గుహతాకుర్తా... స్పేస్ క్రాఫ్ట్స్ కోసం పరికరాలు తయారుచేశారు. హీలియో ఫిజిక్స్‌లో ఆమె కీలకంగా ఉన్నారు. దీని ద్వారా సూర్యుణ్ని పరిసోధిస్తోంది నాసా. ఆమె పర్యవేక్షణలోనే ఈ ప్రాజెక్టు కార్యక్రమం జరుగుతోంది. సూర్యుడి చెంతకు త్వరలా నాసా పంపే మిషన్లకు ఆమె కీలక సేవలు అందిస్తారు. (Image source: NASA)
Swati Mohan: ఈమధ్య కాలంలో మారుమోగుతున్న పేరు స్వాతి మోహన్. తాజాగా మార్స్‌పై పెర్సెవరెన్స్ రోవర్ ల్యాండ్ అవ్వడం వెనక ఆమె కీలక పాత్ర పోషించారు. ఏడాది వయసప్పుడే అమెరికాకు వెళ్లిన స్వాతి మోహన్... నాసాలో కీలకమైన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీలో పర్సెవరెన్స్ ద్వారా తన కలల ప్రయాణం ప్రారంభించారు. నాసా 'మార్స్ 2021' ప్రయోగంలో స్వాతి మోహన్ గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ ఆపరేషన్లకు నేతృత్వం వహించారు. ఫిబ్రవరి 18న పర్సెవరెన్స్‌ను విజయవంతంగా ల్యాండ్ చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. (Image source: Wikipedia)