1. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మొబైల్ యూజర్లకు శుభవార్త చెప్పింది. టెలికామ్ కంపెనీలన్నీ 30 రోజుల వేలిడిటీతో ప్లాన్స్ తీసుకురావాలని ఆదేశించింది. కనీసం ఒక ప్లాన్ వోచర్, ఒక స్పెషల్ టారిఫ్ వోచర్, ఒక కాంబో వోచర్‌ను 30 రోజుల వేలిడిటీతో ఇవ్వాలని ట్రాయ్ తాజాగా ఆదేశించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇందుకోసం ట్రాయ్ టెలీకమ్యూనికేషన్ ఆర్డర్ 1999 లో సవరణలు చేసింది. టెలికామ్ ఆఫరేటర్లు నెల అంటే 30 రోజుల వేలిడిటీ కాకుండా కేవలం 28 రోజుల వేలిడిటీతో ప్లాన్స్‌ని ఆఫర్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ యూజర్లు ట్రాయ్‌ను ఆశ్రయించారు. యూజర్ల నుంచి ఈ సూచనలు ఎక్కువగా రావడంతో ట్రాయ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. "ప్రతీ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ తప్పనిసరిగా ఒక ప్లాన్ వోచర్, ఒక స్పెషల్ టారిఫ్ వోచర్, ఒక కాంబో వోచర్‌ను 30 రోజుల వేలిడిటీతో అందించాలి" అని టెలీకమ్యూనికేషన్ ఆర్డర్ 1999 లో తాజా సవరణను చేర్చింది ట్రాయ్. ఈ సవరణ అమలు చేయడంతో వినియోగదారులు కావాల్సిన వేలిడిటీ, డ్యూరేషన్ ఎంచుకోవడానికి మరిన్ని ఆప్షన్స్ లభిస్తాయని, టారిఫ్ విషయంలో మరింత ఛాయిస్ ఉంటుందని ట్రాయ్ వివరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. తమకు 28 రోజుల వేలిడిటీతో ఉన్న ప్లాన్స్‌పై వినియోగదారుల నుంచి అనేక సూచనలు అందాయని ట్రాయ్ తెలిపింది. వాటిని నెలవారీ టారిఫ్ ప్లాన్స్‌గా భావించడం సాధ్యం కాదని వివరించింది. అయితే దీనిపై జోక్యం చేసుకోవాలా వద్దా అని గతేడాది మేలోనే ట్రాయ్ ఓ కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
5. తమకు వచ్చిన సూచనల్ని పరిగణలోకి తీసుకొని టెలికామ్ టారిఫ్ 66వ సవరణ ఆర్డర్ 2022 కింద సబ్ క్లాజెస్ అంటే ఉప నిబంధనలు చేర్చింది ట్రాయ్. ఈ నిబంధనల ప్రకారం టెలికామ్ కంపెనీలు తప్పనిసరిగా 30 రోజుల ప్లాన్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. ఎంత ధరలో ఈ ప్లాన్స్‌ని టెలికామ్ కంపెనీలు రూపొందిస్తాయో చూడాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రస్తుతం టెలికామ్ కంపెనీలు నెలరోజుల ప్లాన్‌కు 28 రోజుల వేలిడిటీ, రెండు నెలల ప్లాన్‌కు 56 రోజుల వేలిడిటీ, మూడు నెలల ప్లాన్‌కు 84 రోజుల వేలిడిటీ చొప్పున అందిస్తున్నాయి. సాధారణంగా నెల అంటే 30 రోజులు, రెండు నెలలు అంటే 60 రోజులు, మూడు నెలలు అంటే 90 రోజులు ఇవ్వాలి. గతంలో ప్లాన్స్ ఇలాగే ఉండేవి. (ప్రతీకాత్మక చిత్రం)
7. కానీ చాలాకాలంగా టెలికామ్ కంపెనీలు నెలకు 28 రోజుల చొప్పు లెక్కించి ప్లాన్స్ రూపొందిస్తున్నాయి. దీంతో కస్టమర్లు నెలకు రెండు రోజుల చొప్పున వేలిడిటీ కోల్పోతున్నారు. ఏడాదికి 12 రీఛార్జులు చేయించాల్సింది పోయి 13 రీఛార్జులు చేయాల్సి వస్తోంది. అంటే అదనంగా ఒక రీఛార్జ్ డబ్బుల్ని చెల్లించాల్సి వస్తోంది. అందుకే వినియోగదారులు ట్రాయ్‌ను ఆశ్రయించారు. (ప్రతీకాత్మక చిత్రం)