Facebook: సరికొత్త రూపులో పరిచయం చేసుకునేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మెటావర్స్ దిశగా వెళ్లాలని ఫేస్బుక్ (Facebook) భావిస్తోంది. ఇదే ఇంటర్నెట్ భవిష్యత్ కాబోతోందని కంపెనీ భావిస్తోంది. అభ్యంతరకర కంటెంట్, అనుసరించే డేటా విధానాలపై ఇటీవలి కాలంలో ఫేస్బుక్ తీవ్ర వివాదాలు ఎదుర్కొంటోంది. దీన్ని చక్కదిద్దేందుకు యూరోప్‌లో 10 వేల మంది నిపుణులైన ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ఫేస్బుక్ ప్రకటించింది. ఈ క్రమంలో సోషల్ మీడియా కంపెనీ నుంచి ఒక మెటావర్స్ కంపెనీగా ఫేస్బుక్ ఎలా రూపాంతరం చెందబోతుందో అనే విషయాన్ని సంస్థ వ్యవస్థాపకుడు 37 ఏళ్ల మార్క్ జూకర్బర్గ్ వెల్లడించారు.
ఇంతకీ మెటావర్స్ అంటే ఏంటి?
మెటావర్స్ అన్నది మెటా, వర్స్ అనే రెండు పదాల సమాహారం. మెటా అన్నది గ్రీక్ పదం. దానర్థం ఆవల. వర్స్ అన్నది యూనివర్స్‌లో భాగం. అంటే ఈ విశ్వం. మెటావర్స్ అంటే విశ్వం ఆవల అని చెప్పుకోవచ్చు. అంటే అదో ఊహ ప్రపంచం లేదా వర్చువల్ వల్డ్. కానీ అనుభూతి మాత్రం వాస్తవమైనదిగా అనిపించేలా ఉంటుంది.
ఇదేమి కొత్త కాన్సెప్ట్ కాదు. మ్యాట్రిక్స్, రియల్ ప్లేయర్ వన్ వంటి సినిమాలు చూసి ఉంటే ఈ మెటావర్స్‌ను అర్థం చేసుకోవచ్చు. వీడియో గేమ్ ఫిపా లేదా మైన్‌క్రాఫ్ట్ లాంటిదనుకోవచ్చు. ఏదైనా గ్యాడ్జెట్ లేదా డివైస్ ద్వారా జనాలు ఆ వర్చువల్ రియాల్టీ ప్రపంచంలోకి ప్రవేశించవచ్చు. ఆ ఆటలో కన్సోల్ ఉపయోగిస్తూ కంట్రోల్ చేసినట్టు కాకుండా ప్లేయర్ స్వయంగా గేమ్‌లో పాల్గొనవచ్చు.
మెటావర్స్ దిశగా కొన్ని గేమింగ్ కంపెనీలు ఇప్పటికే అడుగులు వేశాయి. ఇప్పుడు టెక్ దిగ్గజాల రాకతో ఈ సాంకేతిక పరిజ్ఞానం మరింత విస్తృతమవుతుంది. ఉదాహరణకు మీరు ఢిల్లీలో ఉన్నారు, మీ కుటుంబం ముంబయిలో ఉంది. కానీ అంతా కలిసికట్టుగా ఒకే టేబుల్ చుట్టు కూర్చుని కలిసి భోజనం చేయవచ్చు. జూమ్, గూగుల్ మీట్ లాంటిదనుకోవచ్చు. అయితే స్క్రీన్‌ను కాకుండా మీరు మీ కుటుంబ సభ్యులను చూడవచ్చు. వ్యాపారపరంగా ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీరు ఆన్లైన్లో ఒక డ్రెస్ ఆర్డర్ చేయడానికి ముందు దాన్ని మీరు పూర్తిస్థాయిలో ఈ టెక్నాలజీ ద్వారా పరిశీలించవచ్చు. ఇంకా చెప్పాలంటే మీరు మీ డ్రాయింగ్ రూమ్‌లో కూర్చొనే టెస్టు డ్రైవ్ చేయదలిచిన కారులో కూర్చొవచ్చు అన్నమాట.
ఇది ఎలా పనిచేస్తుంది?
దీని కోసం VR లేదా వర్చువల్ రియాల్టీ హెడ్ సెట్ అవసరమవుతుంది. దీని కోసం ఫేస్బుక్ సొంత ప్రొడక్టే ఉంది. 2014లోనే అది ఆక్యూలస్ VR హెడ్సెట్ కంపెనీని 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆక్యూలస్ హెడ్సెట్ ధరించి లీనమైపోయే వాతావరణాన్ని 2019లో ఫేస్బుక్ హోరైజన్ పేరుతో ఫేస్బుక్ ఆవిష్కరించింది. Metaverse అన్నది ఒక సంపూర్ణ ఆర్థిక వ్యవస్థ అవుతుంది. అందులో మీరు ఉత్పత్తులను సృష్టించవచ్చు, అమ్మవచ్చు, కొనవచ్చు అని వెంచర్ క్యాపిటలిస్ట్ మ్యాథ్యూ బాల్ తన బ్లాగ్ రాశారు. గేమింగ్ కోసం ఇప్పటికే టోకెన్లు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా NFT (నాన్ ఫంగిబుల్ టోకెన్స్) వస్తాయి. భౌతిక ప్రపంచం, డిజిటల్ ప్రపంచంలో ఒక అనూహ్యమైన అనుభూతిని ఇది అందిస్తుందని మ్యాథ్యు విశ్లేషించారు. మెటావర్స్ అన్నది కేవలం వర్చువల్ రియాల్టి కాదని, అది పర్సనల్ కంప్యూటర్, మొబైల్ డివైజ్‌లు, గేమింగ్ కన్సోల్స్ సహ రకరకాల కంప్యూటింగ్ వేదికల ద్వారా యాక్సెస్ చేయవచ్చని జూకర్బర్గ్ తెలిపారు. ఇప్పుడు మనం చూస్తున్న సోషల్ ఫ్లాట్‌ఫామ్స్‌కు హైబ్రిడ్ వెర్షన్‌గా ఇది ఉంటుందని అన్నారు.
దీని నిర్మాణం ఎలా ఉంటుంది?
ఇది ఒక కంపెనీ మాత్రమే రూపొందించే ఏకైక వస్తువు కాదని ఫేస్బుక్ రియాల్టీ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ బాస్వర్త్ తెలిపారు. ఇది రాత్రికి రాత్రి జరిగిపోదని. అది వాస్తవ రూపం దాల్చేందుకు 10-15 సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు. ఫోర్ట్‌నైట్ వంటి ఆన్లైన్ గేమ్స్, రోబ్లోక్స్ వంటి గేమింగ్ ఫ్లాట్‌ఫామ్స్, ఇప్పటికే ఈ వర్చువల్ ప్రపంచంలో ప్రయోగాలు చేపట్టాయి. గ్రాఫిక్స్ కంపెనీ Nvidia, 3D వర్చువల్ వల్డ్తో కనెక్ట్ అయ్యేందుకు సొంతంగా ఓమ్నివర్స్ అనే దాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. పరిశ్రమ భాగస్వాములు, పౌరహక్కుల సంఘాలు, ప్రభుత్వాలు, లాభాపేక్షరహిత సంస్థలు, విద్యా సంస్థలతో కలిసి మెటావర్స్‌ను అభివృద్ధి చేసేందుకు ఫేస్బుక్ 50 మిలియన్ డాలర్లు ప్రకటించింది. ఇప్పుడు అందులో భాగంగా 10 వేల మంది నిపుణులైన ఉద్యోగులను యూరోప్‌లో నియమించుకోనున్నట్టు వెల్లడించింది.
* మరి డేటా ప్రైవేసీ మాటేంటి?
ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్‌పై ప్రతికూల ప్రచారం తీవ్రమవుతోంది. ఫేస్బుక్ ఉత్పత్తుల వల్ల పిల్లలపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే విషయం కంపెనీకి తెలుసని మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హుగెన్ ప్రకటించడం సంచలనం సృష్టించింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ యాజమాన్యంలోని ది వాష్టింగన్ పోస్టు కూడా ఫేస్బుక్ మెటావర్స్ గురించి రాసింది. కంపెనీ ప్రతిష్ఠను పునరుద్ధరించుకునేందుకు ఇది ప్రయత్నం కాబోలని పేర్కొంది.
మెటావర్స్‌లో డేటా ప్రైవసీ గురించి ఎక్కువ వివరాలను ఫేస్బుక్ వెల్లడించలేదు. కానీ యూజర్ డేటా విషయంలో ఇటీవల ఫేస్బుక్ అనుసరిస్తున్న తీరుపై వస్తున్న వివాదాల కారణంగా మెటావర్స్‌లో పూర్తి విభిన్నమైన పోకడలను ఫేస్బుక్ అనుసరించవచ్చు. జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR) లో భాగంగా యూరోపియన్ యూనియన్ ప్రపంచంలో కఠినమైన డేటా గోప్యతను విధిస్తుండటం వల్ల వాటిని అనుగుణంగా ఈ కొత్త టెక్నాలజీని అభివృద్ధిపరచవచ్చు.
యూరోప్‌లో మెటావర్స్ విస్తరణపై గురించి కంపెనీ స్పందిస్తూ, ఇంటర్నెట్కు సంబంధించి కొత్త నిబంధనల రూపకల్పనలో యూరోపియన్ యూనియన్ (EU)కు ముఖ్య పాత్ర ఉంటుంది. స్వేచ్ఛాయుత భావవ్యక్తీకరణ, పారదర్శకత, వ్యక్తుల హక్కుల వంటి యూరోపియన్ విలువలను రోజువారీ ఇంటర్నెట్ పనుల్లో చొప్పించేందుకు యూరోపియన్ విధానరూపకర్తలు కృషి చేస్తున్నారని పేర్కొంది.