డిజిటల్ వినియోగం పెరిగిన కొద్దీ సైబర్ నేరాలు అధికమవుతున్నాయి. రోజుకో పద్దతిలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. తాజాగా బ్యాంకు కస్టమర్లను బోల్తా కొట్టించేందుకు మెసేజ్‌ల రూపంలో వల వేస్తున్నారు. పాన్ కార్డ్ వివరాలు అప్డేట్ చేయాలని, కేవైసీ వివరాలను పొందుపర్చాలని మెసేజ్‌లు చేస్తున్నారు. వాటి బారిన పడొద్దని బ్యాంకు అధికారులు, సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
* నమ్మించి మోసం : హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లకు సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మెసేజ్‌లను ఫోన్లకు పంపిస్తున్నారు. అకౌంట్ వివరాలు అప్డేట్ చేయాలని, పాన్ వివరాలు వెంటనే పొందుపర్చాలని బ్యాంకు నుంచి మెసేజ్ పంపిస్తున్నట్లు ఏమార్చుతున్నారు. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని కస్టమర్లను హెచ్చరిస్తున్నారు.
ఇలా చేస్తూ కస్టమర్లను కంగారుకు గురి చేస్తున్నారు. అదే మెసేజ్‌లో ఒక లింక్‌ని కూడా జత చేస్తున్నారు. ఈ లింక్ ద్వారా వివరాలను అప్డేట్ చేయాలని సూచిస్తున్నారు. ఖాతాదారులను నమ్మించి ఆ లింక్ ద్వారా వివరాలను సేకరిస్తున్నారు. దీంతో లాగిన్ క్రెడెన్షియల్స్, పాస్వర్డ్ వంటి వివరాలను సైబర్ నేరగాళ్లు తస్కరిస్తున్నారు. అనంతరం ఈ వివరాలను ఉపయోగించి అకౌంట్లో నుంచి డబ్బును మాయం చేస్తున్నారు. ఈ తరహా మోసాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
‘డియర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్.. మీ పాన్ వివరాలు పొందుపర్చకపోతే అకౌంట్ రద్దవుతుంది. దయచేసి అకౌంట్ వివరాలు సమర్పించండి’ అంటూ ఓ మెసేజ్ వచ్చిందని సంఘమిత్ర అనే యూజర్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు దృష్టికి తీసుకొచ్చారు. ఇదే తరహా మెసేజ్ తనకూ వచ్చిందంటూ మరో ట్విటర్ యూజర్ హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. గతేడాది ఎస్బీఐ కస్టమర్లు కూడా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు.
* నమ్మొద్దని బ్యాంకుల సూచన : బ్యాంకు పేరు మీద వచ్చే ఫేక్ మెసేజ్‌లను నమ్మొద్దని ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు సూచిస్తున్నాయి. మెసేజ్‌లలోని లింక్‌లను క్లిక్ చేస్తే మోసపోతారని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని సూచిస్తున్నాయి. hdfcbk / hdfcbn అధికారిక ఐడీ నుంచి మాత్రమే బ్యాంకు మెసేజ్‌లు పంపుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాజమాన్యం సూచిస్తోంది. ఈ మెసేజ్‌లలో వచ్చే లింక్ http://hdfcbk.io మాదిరిగా ఉంటుందని తెలిపింది. అటు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చింది. మెసేజ్‌ల ద్వారా కస్టమర్ల వ్యక్తిగత వివరాలు ఎస్బీఐ బ్యాంకు అడగబోదని తెలిపింది. కస్టమర్లు జాగ్రత్త వహించాలని కోరింది.