NASA Asteroid : కరోనాతో టెన్షన్ పడుతున్న సమయంలో... మానవాళికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా (NASA) ఓ చేదు విషయం చెప్పింది. ఓ భారీ గ్రహశకలం జూన్ 6న భూమివైపు వస్తోందట. ఇది చిన్న గ్రహశకలం కాదు. దీని పరిమాణం 800 నుంచి 1800 అడుగుల దాకా ఉండొచ్చంటున్నారు. దీన్ని పొటెన్షియల్లీ డేంజరస్ కేటగిరీలో చేర్చింది నాసా. భూమికి ప్రమాదకరం అని భావించే గ్రహశకలాల్ని మాత్రమే ఈ జాబితాలో నాసా చేర్చుతుంది. గత నెల్లో వచ్చిన రెండు భారీ గ్రహశకలాల్ని కూడా ఇదే లిస్టులో నాసా చేర్చింది.
2002 NN4గా పిలిచే ఈ ఆస్టరాయిడ్... భూమికి 51 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుంది. దీని వేగం సెకండ్‌కి 11.1 కిలోమీటర్లు. అంటే ఇది... విశాఖ నుంచి హైదరాబాద్‌కి నిమిషంలో వెళ్లగలదు. అంటే ఇది ఎంత వేగంతో వెళ్తుందో ఊహించుకోండి. అంత వేగంతో వెళ్లే రాయి భూమిని ఢీ కొంటే... భూమి ముక్కలవ్వడం ఖాయం. కానీ ఈ గ్రహశకలం వల్ల మనకు అలాంటి టెన్షన్ ఏదీ లేదనుకోవచ్చు. అది మనకు చాలా దూరం నుంచి వెళ్తోంది కాబట్టి ప్రమాదం లేదు. అయినప్పటికీ నాసా మాత్రం... ఎందుకైనా మంచిదని అలర్ట్ చేసింది. (గ్రహశకలాన్ని మీరు ఈ లింక్‌లో చూడొచ్చు (credit - https://ssd.jpl.nasa.gov/sbdb.cgi?sstr=163348&orb=1)
నిజానికి మన భూమి ఓ ప్రమాదకరమైన విశ్వంలో తిరుగుతోంది. ఎందుకంటే... మన భూమి చుట్టూ... 450 అడుగుల కంటే పెద్దగా విస్తీర్ణం కలిగిన గ్రహశకలాలు 8000కు పైగా ఉన్నాయి. ఇవన్నీ భూమికి 70 లక్షల కిలోమీటర్ల లోపు తిరుగుతున్నాయి. వీటిని నాసా పొటెన్షియల్లీ డేంజరస్ ఆస్టరాయిడ్స్ లిస్టులో చేర్చింది. ఇంకాస్త దూరానికి లెక్క వేస్తే... దాదాపు 25000 దాకా ఇవి ఉండొచ్చనే అంచనా ఉంది. ఇన్ని ఉన్నా... ఏ ఒక్కటీ భూమికి తగలకపోవడం మన అదృష్టం అనుకోవచ్చు