డిజిటల్మోఫో (digitalmofo) అనే రెడ్డిట్ వినియోగదారు కొన్ని రోజుల క్రితం అలసిపోయినట్లు అనిపించడం వల్ల త్వరగా నిద్రపోతున్నట్లు భావించాడు. అయితే.. ఆ సమయంలో అతని ఆపిల్ వాచ్ 7 సిరీస్ (Apple Watch 7 series) అధిక పల్స్ రేటు ను గుర్తించి అతనికి అనేక హెచ్చరికలను పంపింది. అయితే.. అతను మాత్రం పట్టించుకోకుండా.. DND మోడ్‌ని యాక్టివ్ చేశాడు. దీంతో అతనికి సౌండ్ నోటిఫికేషన్ రాలేదు.
కానీ, కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా పల్స్ కు సంబంధించిన వార్నింగ్ నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత తన వైద్యుడికి అతను వీడియో కాల్ చేశాడు. అప్పుడు డాక్టర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. వాచ్ డేటాను సైతం చూశారు. ఇందులో పల్స్ రేటు మరియు ఆక్సిజన్ డేటా ఉన్నాయి. ప్రమాదాన్ని గుర్తించిన వైద్యుడు స్వయంగా అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు.
దీని తర్వాత అతడిని ఆసుపత్రికి తరలించారు. వినియోగదారు హిమోగ్లోబిన్ 3 g/dLకి పడిపోయిందని వైద్యులు గుర్తించారు. అయితే, పురుషులకు సాధారణ హిమోగ్లోబిన్ 13 g/dL కంటే ఎక్కువగా ఉండాలి. 5.0 g/dL కంటే తక్కువ హిమోగ్లోబిన్ ప్రమాదకరంగా పరిగణించబడుతుంది మరియు గుండె వైఫల్యానికి దారితీయవచ్చు. అంటే, వినియోగదారుడికి దాదాపు క్రిటికల్ కండిషన్లో ఆసుపత్రికి తీసుకువచ్చారు.