భారత దేశంలో పుట్టిన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నది. ప్రజల్లో ఈ యోగాపై మరింత అవగాహన కలిగించడానికి యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని రకాల వర్గాల వారికి ప్రత్యేకమైన కొన్ని ఆసనాలు ఉన్నాయి. మనిషి మానసిక, ఆధ్యాత్మిక, శారీరిక క్రమశిక్షణకు ఈ ఆసనాలు ఎంతగానో ఉపయోగపడుతాయి. క్రికెట్లో ఎన్నోరకాల షాట్లు ఆడాల్సి ఉంటుంది. దానికి తగ్గట్లుగా మన శరీరం కూడా పని చేయాలి. అందుకే యోగాలో కొన్ని ఆసనాల ద్వారా మన శరీరాన్ని అలా మలుచుకోవచ్చని యోగా గురువు 'అరుణ్ గుప్తా' చెబుతున్నారు. ఈ 5 ఆసనాలు క్రికెటర్ అవ్వాలనుకుంటున్న ప్రతీ ఒక్కరు నిత్యం సాధన చేయాలని అంటున్నారు.
1. చతురంగ దండాసనం (Plank Pose) - ప్రతీ క్రికెటర్ వెన్నెముక పటుత్వాన్ని పెంచుకోవలసి ఉంటుంది. అందుకు దండాసనం చక్కగా ఉపయోగపడుతుంది. రెండు చేతులు, కాలి వేళ్లపై ఫొటోలో చూపిన విధంగా ఉంచి కాసేపు ఆ ఫోజులోనే ఉండాలి. నడుమును వంచకుండా చాలా స్ట్రెయిట్‌గా ఉండాలి. అలా చేయడం వల్ల మన వెన్నెముక స్ట్రాంగ్‌గా తయారవుతుంది. (Representational Image)
2. నౌకాసనం (Boat Pose) - పేరులో చెప్పినట్లు నౌక రూపంలో కూర్చోవాలి. కేవలం మన పిరుదులను మాత్రమే నేలపై ఉంచి చిత్రంలో చూపినట్లుగా కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల పొత్తి కడుపు, నడుము కింది భాగానికి రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఆక్సిజన్ చక్కగా కింది భాగాలకు చేరుకుంటుంది. కాలి తొడలు, పిక్కల కొవ్వును కరిగించి స్ట్రాంగ్‌గా చేస్తుంది. క్రికెటర్ల ఫుట్‌వర్క్ మెరుగవ్వడానికి ఈ ఆసనం తోడ్పడుతుంది. (Representational Image)
3. ఉత్కటాసనం (Chair Pose) - ఉత్కటాసనం అంటే కుర్చీలాగ కాళ్లపై నిలబడటం. చిత్రంలో చూపిన విధంగా కాసేపు నిలబడితే కాళ్లు, వీపు, భుజాలు, కీళ్లు బలంగా తయారవుతాయి. బ్యాట్స్‌మెన్ అయినా బౌలర్ అయినా బలమైన కాళ్లు, భుజాలు కలిగి ఉండాలి. అంతే కాకుండా తరచూ కీళ్ల నొప్పులు రాకుండా ఈ ఆసనం ఉపయోగపడుతుంది. క్రికెటర్లు మెరుగైన ప్రదర్శన చేయడానికి ఈ ఆసనం వేయడం చాలా అవసరం. (Representational Image)
4. బుద్ద కోణాసనం (Butterfly Pose) - బుద్ద కోణాసనం అంటే సీతాకోక చిలుకలా మారిపోవడం. రెండు కాళ్లు, రెండు చేతులు దగ్గరపెట్టి కూర్చోవడాన్నే బుద్ద కోణాసనం అంటారు. ఈ ఆసనం వల్ల మన శరీర పైభాగం, కిందిభాగం సమతుల్యతను సాధిస్తాయి. నడుము దగ్గర ఉండే ఎముకలు చాలా స్ట్రాంగ్‌గా తయారవుతాయి. స్వీప్ షాట్లు ఆడటానికి అనుగుణంగా శరీరం మారిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన ఆసనమని గురువు చెబుతున్నారు. (Representational Image)
5. మార్జారి ఆసనం (Cat Pose) - ఇంట్లో మనకు కనిపించే పిల్లులను జాగ్రత్తగా గమనించండి. అవి కాసేపు కిందికి.. మరి కొద్ది సేపు తల ఎత్తి చూస్తుంటాయి. మనం కూడా అలా ఆసనం వేయడాన్ని మార్జారి ఆసనం అంటారు. ఈ ఆసనం వేయడం ద్వారా మనకు వెన్ను నొప్పులు లాంటివి ఉంటే తగ్గిపోతాయి. ప్రతీ క్రికెటర్‌కు ఈ వెన్నునొప్పి సమస్య తప్పక వస్తుంది. అందుకే మ్యాచ్ ముగిసిన వెంటనే ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయాలి. దీని వల్ల వెన్నుపూస ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. (Representational Image)