ఐసీసీ (ICC) తొలిసారిగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాంప్రదాయ క్రికెట్ ఫార్మాట్ ఫైనల్‌కు సౌతాంప్టన్ వేదికగా మారనుంది. ఏడాది కాలంలో టెస్టుల్లో తొలి రెండు ర్యాంకుల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయ్. వచ్చేనెల 18వ తేదీన ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ లు అమీ తుమీ తేల్చుకోనున్నాయ్.
ఇప్పటికే, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, వృద్ధిమాన్ సాహా, ప్రసిద్ధ కృష్ణ, హెడ్ కోచ్ రవిశాస్త్రి బయోబబుల్‌లోకి వెళ్లినట్లు తేలింది. మిగిలిన ఆటగాళ్లు త్వరలోనే వారితో జత కట్టనున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. వారి కోసం ముంబైలోని ఓ స్టార్ హోటల్లో బయో సెక్యూర్ బబుల్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ కొనసాగుతోన్న సమయంలో వృద్ధిమాన్ సాహా, ప్రసిద్ధ కృష్ణ ఇద్దరూ కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. అనంతరం వారు ఐసొలేషన్‌లోకి వెళ్లారు. డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు. కరోనా బారి నుంచి కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడ్డారు. బీసీసీఐకి తమ ఫిట్నెస్ సర్టిఫికెట్లను కూడా అందజేయడంతో వారికి ఇంగ్లాండ్ పర్యటనకు బెర్త్ కన్ఫర్మ్ అయింది. టీమిండియా ప్లేయర్లు వచ్చేనెల 2వ తేదీన ఇంగ్లాండ్‌కు బయలుదేరాల్సి ఉంది. 18న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ముగిసిన తరువాత కూడా అక్కడే ఉంటుంది కోహ్లీ టీమ్.