సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకూ జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 15 మందితో కూడిన జట్టును కివీస్ ప్రకటించింది. తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో రెండో టెస్టుకు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమైన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న అతడు మళ్లీ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. కీపర్ వీజే వాట్లింగ్ కూడా అందుబాటులోకి వచ్చాడు.
ఇంగ్లండ్‌తో ముగిసిన రెండో టెస్టుకి గాయాల కారణంగా కేన్ విలియమ్సన్, వీజే వాట్లింగ్ దూరమైన విషయం తెలిసిందే. విలియమ్సన్కి మోచేతి గాయం కాగా.. వాట్లింగ్ వెన్ను గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. అయితే కీలక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ సమయానికి ఈ ఇద్దరూ ఫిట్నెస్ సాధిస్తారని న్యూజిలాండ్ టీమ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ ధీమా వ్యక్తం చేశాడు. కోలిన్ డీ గ్రాండ్‌హోమ్‌ను స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్‌గా.. అజాజ్ పటేల్‌ను స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఎంపికచేశారు. సౌథాంప్టన్ పిచ్ పేస్‌కి అనుకూలించనుండడంతో .. అజాజ్ పటేల్ రూపంలో కేవలం ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్‌కి టీమ్‌లో కివీస్ చోటిచ్చింది. ఇక బ్యాకప్ కీపర్‌గా టామ్ బ్లండెల్ ఎంపికయ్యాడు.
మరోవైపు, టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్ లో హోరాహోరీగా పాల్గొంటుంది. ఇంట్రాస్వ్యాడ్ మ్యాచ్ లో రిషభ్ పంత్, గిల్ లాంటి యంగ్ కుర్రాళ్ల మంచి టచ్ లో కన్పించగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిథమ్ అందుకున్నారు. పేస్ బౌలింగ్ లో ఇషాంత్ శర్మ, షమీ మంచి లయతో స్వింగ్ బౌలింగ్ వేశారు. బుమ్రా కూడా టచ్ లోకి వస్తే టీమిండియా బౌలింగ్ విభాగానికి తిరుగుండదు.