ఇటీవలె ముగిసిన మహిళల అండర్ 19 ప్రపంచకప్ (Women's U-19 T20 World Cup)లో తెలంగాణ అమ్మాయి, భద్రాచలం ముద్దుబిడ్డ గొంగడి త్రిష (Gongadi Trisha) మెరిసిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ (England)తో జరిగిన ఫైనల్లో త్రిష మూడు ఫోర్ల సహాయంతో 24 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. టీమిండియా విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించింది.
త్రిష స్వస్థలం భద్రాచలం. తండ్రి రామిరెడ్డి కూడా క్రీడాకారుడే. ఆయన అండర్-16లో రాష్ట్ర హాకీ జట్టులో ఆడారు. ఆ తర్వాత హైదరాబాద్ లోఐటీసీ జిమ్ ట్రైనర్‌గా ఉద్యోగంలో చేరారు. కూతుర్ని క్రికెటర్ చేయాలని ఆయన ఆకాంక్ష. అందుకు తగ్గట్టే చిన్న వయసు నుంచే త్రిషకు క్రికెట్లో శిక్షణ ఇప్పించారు. అందుకోసం రామిరెడ్డి తనకున్న నాలుగెకరాల పొలం కూడా అమ్మేశారు. త్రిషకు చిన్న వయసు నుంచే టీవీల్లో క్రికెట్ మ్యాచ్ లు చూపించారు. తన సొంత జిమ్ కు తీసుకెళ్ళి శిక్షణ ఇచ్చారు. సిక్రింద్రాబాద్ లో శ్రీనివాస్ అనే క్రికెట్ కోచ్ వద్ద చేర్పించి, క్రికెట్లో మెళకువలు నేర్పించారు.
త్రిషకు శిక్షణ ఇప్పించేందుకు రామిరెడ్డి చాలా త్యాగాలే చేయాల్సి వచ్చింది. ఐటీసీలో ఉద్యోగం వదిలేసుకున్నారు. త్రిషకు అనుకూలంగా ఉండేలా ఫ్యామిలీని సికింద్రాబాద్ కు మార్చారు. ఆమె ఆటను ఎనాలసిస్ చేసిన కోచ్ లు, అప్పటి వరకూ ఫాస్ట్ బౌలర్‌గా ఉన్న త్రిషను లెగ్ స్పిన్ వేయాలని సూచించారు. దీంతో అనిల్ కుంబ్లేను అనుకరిస్తూ త్రి లెగ్ స్పిన్ వేయడం మొదలుపెట్టింది.
భద్రాచలం నుంచి హైదరాబాద్ కు వచ్చిన త్రిష అండర్-16 జట్టుకు ఆడింది. ఆ తర్వాత అండర్-19, అండర్-23లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించింది. అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీలో త్రిష మంచి ఆటతీరు కనబరిచింది. అండర్-19 ఉమెన్స్ కోచ్ నూషిన్ అల్ ఖాదీర్ త్రిషకు శిక్షణ ఇచ్చారు. భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా ఆ కోచింగ్ అకాడమీలో త్రిషకు మెళకువలు నేర్పించారు. త్రిష క్రికెట్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రానించడంతో తండ్రి రామిరెడ్డి త్యాగం ఫలించింది. త్రిష అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఎంపికైంది. అయితే వేలంలో అమ్ముడు పోకపోవడం ఆమె కెరీర్ కు స్పీడ్ బ్రేకర్ లాంటిది. అయితే దీనిని పట్టించుకోకుండా తన కెరీర్ పై దృష్టి పెట్టాలి.