ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2021-23 (WTC 2021-23 Final) ఫైనల్ రేస్ రసవత్తరంగా మారింది. కీలకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC 2021-23 Final) కు ఈ సారి టీమిండియా(Team India) చేరడమే క్లిష్టంగా మారింది. కష్టపడితే మాత్రం ఛాన్సులుంటాయ్. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో టీమిండియా మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఆస్ట్రేలియా 75 శాతం విజయాలతో అగ్రస్థానంలో ఉంది. ఇక, డబ్ల్యూటీసీ 2021-23 ఎడిషన్‌లో టీమిండియా ఫైనల్ చేరాలంటే ఈ సీజన్లో మిగిలి ఉన్న ఏడు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరచడంతో పాటు మిగతా జట్ల జయాపజయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ ఓటమి భారత జట్టు అవకాశాలను సంక్లిష్టం చేసింది.
ఇప్పటి వరకు ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లతో జరిగిన సిరీస్‌ల్లో 6 విజయాలు, 2 డ్రా చేసుకున్న టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక 2021-23 షెడ్యూల్లో భాగంగా ఇంకా ఇంగ్లండ్‌లో ఒక టెస్టు, బంగ్లాదేశ్‌లో రెండు, స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు టీమిండియా ఆడాల్సి ఉంది.
ఆస్ట్రేలియా బలమైన జట్టు. పాకిస్తాన్, శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడటం వాళ్లకు కలిసొచ్చినట్టే. ఉపఖండ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకోవడానికి టీమిండియాతో సిరీస్‌కు ముందు పాక్, శ్రీలంక పర్యటన వారికి మేలు చేస్తుంది. ఆస్ట్రేలియా టీమ్ కు నాథన్ లియాన్, స్వెప్సన్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. అయితే, ఇంగ్లండ్‌తో మ్యాచ్ మినహా మిగతావన్నీ ఉపఖండంలోనే ఆడటం భారత్‌కు కలిసి వచ్చే అంశం.