అంతర్జాతీయ క్రికెట్లో కేవలం 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం. కానీ.. కేవలం ఒకే ఒక్క ఓవర్‌తో హీరోగా మారిపోయాడు. అభిమానుల ఆనందానికి అవదులు లేకుండా చేశాడు. 2007 టి20 ప్రపంచకప్ హీరో, టీమిండియా వెటరన్ క్రికెటర్ జోగిందర్ శర్మ శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు.
టీమిండియాకు తొలి టీ20 వరల్డ్ కప్ అందించిన జోగిందర్ శర్మ తన రిటైర్మెంట్ లేఖను బీసీసీఐ సెక్రటరీకి పంపించాడు. 2002 నుంచి 2017 వరకు సాగిన తన కెరీర్లో బీసీసీఐ అందించిన సపోర్ట్ మరువలేనిదన్నాడు జోగిందర్. అలాగే తన సుదర్ఘీ కెరీర్లో తనతో పనిచేసిన కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్‌కూ జోగిందర్ థ్యాంక్స్ చెప్పాడు. ఎన్నో మధుర జ్ఞాపకాలతో తన కెరీర్ సాగిందని.. ఇప్పుడు వీడ్కోలు పలకడాన్ని కూడా ఎంతో ఆస్వాదిస్తున్నట్లు జోగిందర్ లేఖలో పేర్కొన్నాడు.
రంజీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన కారణంగా 2004-05 దేశీయ సీజన్లో జోగిందర్ శర్మ టీమిండియాలో ఎంపికయ్యాడు. ఒక మ్యాచ్‌లో వరుసగా సెంచరీలు చేయడంతోపాటు 10 వికెట్లు తీశాడు. అదే సమయంలో ఇండియా ఏ తరఫున ఆడుతున్నప్పుడు, ఇండియా సీనియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌ను తెగ ఇబ్బంది పెట్టాడు.
జోగిందర్ శర్మ 2007 టీ20 ప్రపంచ కప్‌లో అరంగేట్రం చేశాడు. ఈ టోర్నమెంట్లో నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో లాస్ట్ ఓవర్ బౌలింగ్ చేసిన జోగిందర్ శర్మ..22పరుగులు కావాల్సిన సమయంలో 15 పరుగులు ఇచ్చాడు. ఇదే నమ్మకంతో పాక్ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వేసే బాధ్యత కూడా జోగిందర్ శర్మకే అప్పగించాడు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ అప్పటికే దారళంగా పరుగులు సమర్పించుకొని ఉండగా.. ధోనీ కూడా జోగిందర్వైపే మొగ్గు చూపాడు.
ఆఖరి ఓవర్లో పాకిస్తాన్ విజయానికి 13 పరుగులు కావాలి. చేతిలో ఉన్నది ఒకే ఒక్క వికెట్.. ఆ వికెట్ తీస్తే జోగిందర్ హీరో..లేకపోతే జీరో. కోట్లాది అభిమానులంతా టీవీలకు అత్తుక్కుపోయిన ఓవర్ అది. అప్పటికే కేవలం నాలుగు మ్యాచ్‌ల ఆడిన అనుభవమున్న జోగిందర్.. ఫైనల్లో అప్పటివరకు వీరబాదుడు బాదిన మిస్బా ఉల్ హక్‌ను ఔట్ చేసి హీరోగా మారాడు.