భారత్ క్రికెట్ లో నవశకం మొదలుకానుంది. ఇండియాలో క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు మాజీ క్రికెటర్లను భాగస్వాములను చేయడానికి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) పావులు కదుపుతున్నారు. టీ-20 ప్రపంచకప్ టోర్నీ వైఫల్యం తర్వాత భారత క్రికెట్ లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయ్. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు కీలక పదవుల్లో నియమితులవుతున్నారు. తమ శక్తి సామర్థ్యాలు, అనుభవాన్ని భావి తరాలకు అందించడానికి సన్నద్ధం అయ్యారు.
లేటెస్ట్ గా టీమిండియా మాజీ టెస్ట్ క్రికెటర్, హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్‌కు కీలక పదవి వరించింది. నేషనల్ క్రికెట్ అకాడమీకి అధిపతిగా నియమితుడు కానున్నాడు. ఈ విషయాన్ని సౌరవ్ గంగూలీ కొద్దిసేపటి కిందటే ధృవీకరించాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. నేషనల్ క్రికెట్ అకాడమీకి హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ పేరును ఖరారు చేసినట్లు చెప్పాడు. లాంఛనప్రాయంగా అతని నియామకాన్ని ఆమోదించాల్సి ఉందని పేర్కొన్నాడు.
నేషనల్ క్రికెట్ అకాడమీని మాత్రమే కాకుండా.. టీమిండియా అండర్-19, టీమిండియా-ఏ టీమ్ బాధ్యతలను కూడా వీవీఎస్ లక్ష్మణ్ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఈ రెండు జట్లకు అతను కోచ్‌గా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదని చెప్పాడు. ఇదివరకు నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్‌గా రాహుల్ ద్రావిడ్ పనిచేశాడు. అతణ్ని టీమిండియా హెడ్ కోచ్‌గా అపాయింట్ చేయడంతో ఈ పదవికి రాజీనామా చేశాడు. అతని స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ అపాయింట్ కానున్నాడు.