కరోనా..కరోనా ఇప్పుడు దేశంలో ఎక్కడా విన్న ఈ మహమ్మారి చేసే విధ్వంసం గురించే అందరూ చెప్పుకుంటున్నారు. ఈ క్రిమి దెబ్బకి చాలా రంగాలు కుదేలవుతున్నాయ్. లేటెస్ట్ గా సజావుగా సాగుతున్న క్యాష్ రీచ్ లీగ్ ఐపీఎల్ కు కరోనా బ్రేకులు వేసింది. ఐపీఎల్ టీమ్ ల్లో కరోనా కేసులు వెలుగు చూడటంతో అప్రమత్తమైన బీసీసీఐ ఐపీఎల్ ను నిరవధిక వాయిదా వేసింది. అయితే, ఇళ్లకు వెళ్లిన క్రికెటర్లకు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించింది. దీంతో క్రికెటర్లు తమ ఫస్ట్ డోస్ వేయించుకోవడానికి క్యూ కట్టారు.
కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో ముంబైలోని తన ఇంటికి చేరిన విరాట్.. తన సతీమణి అనుష్క శర్మ, కూతురుతో ఈ ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ సూచన మేరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు విరాట్ కోహ్లీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు.
రెండు రోజుల క్రితం బీసీసీఐ కూడా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత ఆటగాళ్లంతా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. సెకండ్ డోస్ తీసుకునే సమయానికి ఆటగాళ్లంతా ఇంగ్లండ్‌లో ఉంటారని, కోవాగ్జిన్ తీసుకుంటే అక్కడ అది దొరకదని, అప్పుడు వ్యాక్సిన్ తీసుకొని ఫలితం ఉండదని పేర్కొంది. ఈ క్రమంలో శిఖర్ ధావన్, అజింక్యా రహానేలు కోహ్లీ కన్నా ముందే వ్యాక్సిన్ తీసుకున్నారు.