ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ ధనాధన్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్ అద్భుత సెంచరీ సాధించాడు. తన వన్డే క్రికెట్ కెరీర్లో 18వ సెంచరీని నమోదు చేశాడు. గప్టిల్ గత మూడేళ్లుగా తన ఫామ్ కోసం నానా తంటాలు పడుతున్నాడు. కానీ 2022 ఏడాదిలో ఈ బ్యాట్స్‌మన్ అద్భుతంగా పునరాగమనం చేశాడు. 2020, 2021 సంవత్సరాల్లో, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిలా గప్టిల్ కూడా ఔట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నాడు. (Photo - AFP)
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మార్టిన్ గప్టిల్ 51 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో తొలి బంతికే డకౌటయ్యాడు. మూడో మ్యాచ్‌లో 126 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన వారిలో రాస్ టేలర్ (21) తర్వాత గప్టిల్ రెండో స్థానంలో నిలిచాడు. (Photo -martyguptill31)
గప్టిల్ గత కొన్నేళ్లుగా పెద్ద జట్లపై పరుగులు చేయలేకపోయాడు. ఈ కారణంతో కొన్ని మ్యాచుల్లో బెంచ్ కే పరిమితమయ్యాడు. ఈ బ్యాట్స్‌మన్ 2019 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు వరుస ODIల్లో అజేయంగా 117 మరియు 118 పరుగులు చేశాడు. దీని తర్వాత అతని బ్యాట్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. మూడేళ్ల తర్వాత.. ఏప్రిల్ 2022లో నెదర్లాండ్స్‌పై గప్టిల్ 106 పరుగులు సాధించాడు. ఇప్పుడు ఐర్లాండ్‌పై సెంచరీ చేశాడు. గప్టిల్ తన దూకుడు ఆటకు పేరుగాంచినప్పటికీ ఈ రెండు మ్యాచుల్లో చాలా నిదానంగా ఆడాడు.
విరాట్ కోహ్లీ కూడా నవంబర్ 2019 నుండి సెంచరీ చేయలేకపోయాడు. ఈ మధ్యే అతనికి చాలా అవకాశాలు వచ్చాయి. భారత్ కంటే తక్కువ ర్యాంక్‌లో ఉన్న జట్లపై కూడా విరాట్ బ్యాట్ పరుగులు చేయలేకపోతున్నాడు. కోహ్లి ఇప్పుడు మార్టిన్ గప్టిల్ బ్యాటింగ్‌ను చూసి నేర్చుకునే ఛాన్స్ ఉంది. అతని దూకుడు శైలితో పాటు, గప్టిల్ ఇప్పుడు క్రీజులో ఎక్కువ సేపు నిలవడంపై దృష్టి పెట్టాడు. స్ట్రయిక్‌రేట్ తగ్గినప్పటికీ భారీ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. (Photo-martyguptill31)