టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvaraj Singh)కు ధన్యవాదాలు చెబుతూ ట్విట్టర్ వేదికగా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. క్యాన్సర్‌ను జయించి యువరాజ్ సింగ్ కోలుకున్న విధానం ఒక్క క్రికెట్లోనే కాకుండా అన్ని రంగాల వారికి స్పూర్తిదాయకం అంటూ ఈ సందర్భంగా కోహ్లీ కొనియాడాడు. ఇటీవల విరాట్ కోహ్లీకి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గోల్డెన్ షూస్ కానుకగా పంపి ట్విట్టర్ వేదికగా అతనిపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి నెట్స్‌లో భుజం భుజం రాసుకు తిరిగిన విరాట్ కోహ్లీ ఇప్పుడు కొత్త తరానికి స్ఫూర్తిగా నిలిచే లెజెండ్‌గా తయారయ్యాడని కొనియాడాడు. మైదానంలో కోహ్లీ క్రమశిక్షణ, అభిరుచి, క్రికెట్ పట్ల అంకితభావం ఈ దేశంలోని ప్రతి చిన్న పిల్లవాడిని క్రికెట్ ఎంచుకొని ఏదో ఒక రోజు నీలిరంగు జెర్సీని ధరించాలని కలలు కనేలా ప్రేరేపిస్తుందని యువీ చెప్పుకొచ్చాడు.