ఐపీఎల్(IPL).. ఈ క్యాష్ రిచ్ లీగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్లీగ్స్ లో ఐపీఎల్ కున్నా క్రేజే సపరేటు. ఈ లీగ్ ద్వారా ఆటగాళ్లతో పాటు బీసీసీఐ (BCCI)కి కూడా కాసుల పంట పండుతూనే ఉంది. ప్రతి ఏటా ఐపీఎల్ కు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 8 జట్లతో జరిగిన లీగ్.. వచ్చే ఏడాది నుంచి 10 జట్లతో జరగనుంది.
ఇక, లేటెస్ట్ గా ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఆర్సీబీ ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. పాత జట్టులోని కొందరు సభ్యులతో ఓ పాడ్కాస్ట్ షోను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విరాట్ కోహ్లీతో పాటు ఏబీ డివిలియర్స్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్, దేవదత్ పడిక్కల్, గ్లెన్ మ్యాక్స్వెల్ తదితర ఆటగాళ్లు పాల్గొని జట్టుతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. లీగ్ తొలి సీజన్లో(2008) జట్టుకు ఎంపికైన నాటి భావోద్వేగ క్షణాలను నెమరువేసుకున్నాడు. ఐపీఎల్ అరంగేట్ర సీజన్ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) తనను తీసుకుంటుందని అస్సలు ఊహించలేదని టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అన్నాడు. తాను రూ.25 లక్షలకు అమ్ముడుపోయానని తెలుసుకొని చాలా క్రేజీగా ఫీలయ్యానని, అస్సలు నమ్మలేకపోయానని తెలిపాడు.
" ఐపీఎల్ తొలి వేలం జరిగే సమయానికి నేను అండర్-19 ప్రపంచకప్ కోసం మలేషియాలో ఉన్నాను. నా కోసం బెంగళూరుతో పాటు ఢిల్లీ ఫ్రాంచైజీ పోటీ పడిన విషయాన్ని ఇప్పటికీ మరచిపోను. నాడు వేలంలో బెంగళూరు జట్టు తనను దాదాపుగా రూ. 25 లక్షలకు(30000 డాలర్లు) సొంతం చేసుకుంది. ఆర్సీబీ తన కోసం అంత భారీ మొత్తం వెచ్చిస్తుందని అస్సలు ఊహించలేదు.
ఆ సమయంలో అంత డబ్బును ఊహించుకుని చాలా క్రేజీగా ఫీలయ్యాను. అగ్రిమెంట్ పేపర్లపై సంతకం చేసిన రోజు నాకింకా గుర్తుంది. టీమిండియాకు ఆడితే కలిగే ఆర్ధిక ప్రయోజనాల గురించి నాకు అప్పుడే తెలిసింది. అప్పుడు నా కోసం ఢిల్లీ ఫ్రాంచైజీ సైతం పోటీపడినప్పటికీ.. వారికి బౌలర్ల అవసరం ఉండడంతో ప్రదీప్ సాంగ్వాన్ వైపు మొగ్గు చూపారు. " అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ ఫస్ట్ సీజన్ నుంచి ఆర్సీబీ మినహా మరే ఇతర జట్టుకు ప్రాతనిధ్యం వహించలేదు. 2008 నుంచి 2012 దాకా ఆర్సీబీలో సాధారణ ఆటగాడిలా కొనసాగిన కోహ్లీ.. 2013 నుంచి 2021 సీజన్ వరకు సారధిగా వ్యవహరించాడు. జట్టును మూడు సార్లు(2015, 2020, 2021) ప్లే ఆఫ్స్ చేర్చిన కోహ్లీ.. 2016లో ఫైనల్కు తీసుకెళ్లాడు. కానీ ఫైనల్లో సన్రైజర్స్ చేతిలో ఓడిన ఆ జట్టు తృటిలో టైటిల్ చేజార్చుకుంది.