సంప్రదాయ క్రికెట్ ఫార్మాట్ లో టీమిండియా (Team India) దూసుకుపోతోంది. అటు స్వదేశం, విదేశాల గడ్డలపై తిరుగులేని విజయాల సాధిస్తోన్న టీమిండియా టెస్ట్ ర్యాంకింగ్స్ లో (ICC Test Rankings) దుమ్మురేపింది. ఐసీసీ తాజాగా ప్రకటించింన ర్యాంకింగ్స్ లో కోహ్లీసేన టాప్ లేపింది. యాన్యువల్ అప్డేట్లో టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత్ నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. 121 రేటింగ్ పాయింట్లతో భారత్ నంబర్‌వన్ ర్యాంకును పదిలం చేసుకుంది.
ఇక, 120 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉంది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముంగిట భారత జట్టుకి ఇది ఉత్సాహానిచ్చే వార్త అని చెప్పాలి. భారత్ మొత్తంగా 24 మ్యాచుల్లో 2914 పాయింట్లు అందుకొంది. మరోవైపు న్యూజిలాండ్ 18 టెస్టులాడి మొత్తం 2166 పాయింట్లు సంపాదించింది.
ఆసీస్‌పై 2-1, ఇంగ్లండ్‌పై 3-1 తేడాతో గెలవడం కోహ్లీసేనకు ఉపయోగపడింది. వెస్టిండీస్, పాకిస్థాన్‌పై 2-0 తేడాతో సిరీసులు గెలవడం కివీస్‌ను ముందుకు తీసుకొచ్చాయి. దక్షిణాఫ్రికా పర్యటనను ఆసీస్ రద్దుచేసుకోవడంతో.. కంగారులు టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో నిలవలేకపోయారు. ఐసీసీ 2020 నుంచి జరిగిన మ్యాచులకు 100%, అంతకు ముందు రెండేళ్లకు 50% పాయింట్ల ఆధారంగా రేటింగ్స్ ఇచ్చింది.
టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ (109) ఒక స్థానం ఎగబాకి మూడో స్థానంలో నిలవగా.. ఒక స్థానం తగ్గిన ఆస్ట్రేలియా (108) నాలుగుకు పడిపోయింది. పాకిస్థాన్ (94), వెస్టిండీస్ (84) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచాయి. దక్షిణాఫ్రికా (80), శ్రీలంక (78), బంగ్లాదేశ్ (46), జింబాబ్వే (10) వరుసగా చివరి స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా తన టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్థాయికి రావడం ఇదే తొలిసారి.
ఇంగ్లండ్ గడ్డపైకి జూన్ 2న వెళ్లనున్న భారత టెస్టు జట్టు.. అక్కడ న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది. నెల రోజుల విరామం తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఢీకొట్టబోతోంది. విరామ సమయంలో భారత్ ప్రాక్టీస్ మ్యాచులు ఆడుతూ సమరానికి సిద్ధమవునుంది.