విరాట్ కోహ్లీని (Virat Kohli) వన్డే కెప్టెన్సీ తప్పించిన దగ్గర నుంచి క్రికెట్ ప్రపంచంలో మొదలైన రచ్చ రోజు రోజుకీ ముదురుతోంది. విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్ శర్మ (Rohit Sharma)ను వన్డే కెప్టెన్ గా నియమించడంతో అసలు రచ్చ మొదలైంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), రోహిత్ శర్మను టార్గెట్ ను చేసుకుని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఆటగాడిగా ఆకట్టుకుంటూ.. ప్రత్యర్థుల కవ్వింపులకు దీటుగా బదులిస్తూ.. కెప్టెన్‌గా నిలకడైన విజయాలు సాధిస్తూ.. ఇన్నాళ్లూ జట్టులో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన అతడు అనూహ్య పరిస్థితుల నడుమ ఇప్పుడు వన్డే కెప్టెన్సీ వదులుకోవాల్సి వచ్చింది. ఇది ఒకరకంగా అతడికి ఇబ్బందికరమే. దీంతో, అతడి ఫ్యాన్స్ నెట్టింట వేదికగా రెచ్చిపోతున్నారు.
“నేను విరాట్ కోహ్లితో ఇంకా మాట్లాడలేదు. అతడి ఫోన్ స్విఛ్చాఫ్‌లో ఉంది. టీ20 కెప్టెన్సీనుంచి తన ఇష్టంతోనే తప్పుకున్నాడు. సెలెక్టర్లు వెంటనే అతనిని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా వైదొలగమని చెప్పవలిసింది. లేదంటే టీ20, వన్డే ఫార్మాట్లో కొన్నాళ్లు కోనసాగమని కోరవలిసింది. ఇలా ఒక్క సారిగా అతడిని కెప్టెన్‌గా తప్పించడం చాలా అన్యాయం "అని రాజ్‌కుమార్ పేర్కొన్నాడు.
"ప్రపంచకప్‌కు ముందు టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగవద్దని కోహ్లిని కోరినట్లు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలను నేను చదివాను.నాకు తెలిసినట్టుగా అటువంటిది ఏమి చెప్పలేదు. గంగూలీ చేసిన వ్యాఖ్యలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం వెనుక గల అసలు కారణాన్ని బయటకు చెప్పడం లేదు. పారదర్శకంగా ఈ నిర్ణయం తీసుకోలేదు. కోహ్లి కెప్టెన్‌గా భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు" అని రాజ్‌కుమార్ శర్మ తెలిపాడు.