టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. వరుసగా పేలవమైన ప్రదర్శనలు కనబర్చుతున్న కోహ్లీ సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు అవుతోంది. అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న కోహ్లీ చాన్నాళ్ల నుంచి పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు.
ఇక భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇటీవల ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్ట్‌లో వీరోచితంగా పోరాడిన పంత్ నంబర్ 5వ స్థానానికి చేరుకున్నాడు. ఇక పంత్ తన గత ఆరు టెస్ట్ ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో రాణించాడు. ఇటీవల టెస్టుల్లో అతని ఫామ్ వల్ల బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానం నుంచి ఆరు స్థానాలు ఎగబాకి అయిదో స్థానానికి చేరుకున్నాడు.
కెరీర్ బెస్ట్ ఫామ్‌తో దూసుకెళ్తున్న ఇంగ్లండ్ క్రికెటర్ జానీ బెయిర్ స్టో ఏకంగా 11 స్థానాలు మెరుగుపరచుకుని పదో ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. 32ఏళ్ల బెయిర్ స్టో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లలో సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అదే ఫ్లోను ఇండియాతో టెస్ట్‌లో కూడా అతను కనబరిచి.. ఇంగ్లాండ్‌ను అలవోకగా విజయ తీరాలకు చేర్చాడు.