అక్టోబర్ 18న బీసీసీఐ ఎన్నికలు జరగనుండగా.. ఆ రోజే తదుపరి అధ్యక్షుడిగా కొనసాగేందుకు 1983 ప్రపంచకప్ విన్నర్ రోజర్ బిన్నికి మార్గం సుగుమమైంది. అన్ని పదవులూ ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఉండటంతో ఏజీఎంలో ఎన్నికలు జరగకపోవచ్చు. ఇటీవల బీసీసీఐ పెద్దలు ఢిల్లీ వేదికగా సమావేశం కాగా.. నామినేషన్లపై చర్చించినట్లు తెలుస్తోంది. రోజర్ బిన్నిని తదుపరి ప్రెసిడెంట్ కొనసాగేందుకు బోర్డు సభ్యులు అంగికరించారని, గంగూలీని పదవిని వదులుకోవాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఉద్దేశపూరకంగా గంగూలీని తప్పించారంటూ వార్తలొస్తోన్నాయి. బీసీసీఐలో పేరుకుపోయిన రాజకీయాలకు బలి అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అయితే దాదా మాత్రం బీసీసీఐ ప్రెసిడెంట్‌గానే కొనసాగేందుకు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా చేసిన తనను ఐపీఎల్ చైర్మన్‌గా ఉండమనడం సమంజసం కాదని, దాదా బోర్డు సభ్యులతో అన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారి ఇచ్చిన ఐపీఎల్ ఛైర్మన్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.
మొత్తానికి బీసీసీఐలో పెద్దలంతా దాదాకు వ్యతిరేకంగా ఉన్నట్లు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇక గంగూలీని కావాలనే బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. రాజకీయాలకు దాదాను బలి చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. జై షా సెక్రటరీగా కొనసాగడానికి లేని ఇబ్బంది.. దాదా మాత్రం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉంటే వచ్చిందా అని మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు.
గతేడాది టీ20 ప్రపంచకప్ లో టీమిండియా లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ మెగాటోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. అయితే, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకున్న తర్వాత అతని నుంచి బలవంతంగా వన్డే కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న బీసీసీఐ, పక్కా ప్లాన్‌తో టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా దూరం చేసింది.