మొహాలి వేదికగా జరిగే ఈ టెస్టు సిరీస్ ద్వారా టీమిండియా (Team India) మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టుల్లో 100వ మ్యాచ్ ను పూర్తి చేయనున్నాడు. ఇలా టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడుతోన్న 12వ ఇండియన్ ప్లేయర్ గా కోహ్లీ ఘనతకెక్కనున్నాడు. ఇలాంటి కోహ్లీ ఫస్ట్ టెస్టులోనే తన యాటిట్యూడ్ ఏంటో క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు.
సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తర్వాత టీమిండియా రన్ మెషీన్ గా విరాట్ కోహ్లీ పేరు తెచ్చుకున్నాడు. అటు సెంచరీల పరంగా... ఇటు పరుగుల పరంగా సచిన్ రికార్డులను బద్దలు కొట్టేది కోహ్లీయే అని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఇక, ఫస్ట్ టెస్టులోనే కోహ్లీ తన ఏంటో చూపాడు. బ్యాటింగ్ లో కాదు.. తన కాన్ఫిడెన్స్ లెవల్స్ ఏంటో ప్రపంచానికి చూపాడు.
వివరాల్లోకెళితే.. సుదీర్ఘ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ ప్రయాణం చాలా గొప్పగా సాగింది. అతను అరంగేట్ర మ్యాచ్లోనూ ప్రత్యర్థి బౌలర్లను భయపడకుండా ఆడాడు. 2011 వెస్టిండీస్ పర్యటనలో భాగంగా సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయం ఎంత మందికి గుర్తుందో తెలియదు కానీ, ఆడుతున్నది కెరీర్లో ఫస్ట్ టెస్ట్ అయినా.. ప్రత్యర్థి బౌలర్లకు కోహ్లీ ఏ మాత్రం భయపడలేదు.
ఆ మ్యాచ్లో విండీస్ బౌలర్ ఫిడేల్ ఎడ్వర్డ్స్.. కోహ్లీని తక్కువ స్కోరుకే ఔట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. దానికి బదులుగా కోహ్లీ కూడా అతనికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడైన ఫిడేల్ ఎడ్వర్డ్స్ లాంటి వాళ్లతో.. అప్పుడే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఓ కుర్రాడు ఇలా చేయడం చాలా అరుదు.
విరాట్ కోహ్లీ తన కెరీర్లో 71వ సెంచరీ కోసం ఎదురుచూస్తున్నాడు. అది అతడు సాధిస్తే పాటింగ్ రికార్డును సమం చేస్తాడు. వీరిద్దరి కంటే ముందు సచిన్ 100 సెంచరీలతో ఎవరికీ అందని దూరంలో ఉన్నాడు. గత కొద్ది కాలంగా విరాట్ కోహ్లీ ఫామ్ లో లేడు. కోహ్లీ సెంచరీ చేసి దాదాపు రెండున్నర ఏళ్లు దాటింది. దీంతో, ఈ మైల్ స్టోన్ మ్యాచులోనైనా కోహ్లీ సత్తా చాటుతాడని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు.