టీ20 ఫార్మాట్ ఎంట్రీతో క్రికెట్ (Cricket) ముఖ చిత్రమే మారిపోయింది. అప్పటి వరకు క్లాస్ గా సాగుతున్న క్రికెట్ లోకి ధనాధన్ షాట్లు ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎంట్రీతో క్రికెట్ పక్కా కమర్షియల్ గా మారిపోయింది. పసందైన ఆటతో అభిమానులను అలరిస్తూనే కాసుల వర్షం కురిపిస్తోన్న ఐపీఎల్.. మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోతుంది.
ఐపీఎల్ 2022 సీజన్‌కి అనుకున్నంత రేటింగ్ అయితే రాలేదు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి భారీ ఫాలోయింగ్ ఉన్న జట్లు వరుస పరాజయాలు ఎదుర్కోవడంతో పాటు ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’ వంటి భారీ సినిమాల ప్రభావం, ఐపీఎల్‌పై తీవ్రంగా పడింది. దీంతో ఐపీఎల్ 2023 సీజన్‌ని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బీసీసీఐ సై అంటోంది.
ఇక, ఐపీఎల్ 2023 మినీ వేలానికి కౌంట్ డౌన్ షూరు అయింది. డిసెంబర్ 23న కొచ్చిలో జరగనున్న ఈ వేలానికి 991 మంది ప్లేయర్లు పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. ఇందులో 714 మంది భారతీయ క్రికెటర్లు కాగా, మిగిలిన 277 మంది ఫారిన్ ప్లేయర్లు. ఐపీఎల్ 2023 మినీ వేలంలో 21 మంది ప్లేయర్లు రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌కి రిజిస్టర్ చేసుకున్నారు.
మినీ వేలంలో తమ కనీస ధరను రూ.2 కోట్లుగా 21 మంది నిర్ణయించారు. వీరిలో ఒక్క భారతీయుడు లేడు. మరి ఆ విదేశీ ఆటగాళ్ల జాబితాలో జేమీ ఓవర్టన్, క్రెగ్ ఓవర్టాన్, అదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, కేన్ విలియమ్సన్, రైలీ రూసో, రాసీ వాన్ డర్ డస్సెన్, ఏంజెలో మాథ్యూస్, నాథన్ కౌల్టర్ నైల్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, శామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్ ఉన్నారు.