జపాన్‌లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు ఒలింపిక్స్ నిర్వహకుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ వైపు జపాన్ రాజధాని టోక్యోలో ఒలంపిక్స్ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు కరోనా కేసులు మళ్ళీ పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడకు అనేక దేశాల నుంచి వందలాది క్రీడాకారులు చేరుకోనున్నారు.
దీంతో వైరస్ వ్యాప్తి మరింత వేగవంతంగా జరిగే ఆస్కారం ఉండడంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. అవసరమైతే ప్రేక్షకుల్లేకుండానే ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామని జపాన్ ప్రధాని యోషిహిదే సుగా వెల్లడించారు. అయితే, గత నెలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పదివేల మంది ప్రేక్షకులకు అనుమతిస్తామని నిర్వహకులు తెలిపారు.
కరోనా నివారణ కోసం గత నెల 21 వరకూ టోక్యోలో ఎమర్జెన్సీ ఉంది. అయితే.. టోక్యో ఒలింపిక్స్ నేపథ్యంలో.. దాన్ని ఎత్తివేయగా.. అప్పటి నుంచి క్రమంగా రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గత వారం వరకూ రోజుకి సగటున 500 వరకూ వచ్చిన కేసులు.. గత రెండు రోజుల క్రితం ఒక్కరోజే జపాన్‌లో 1821 కేసులు నమోదవగా.. ఇందులో టోక్యోలో నమోదైనవే 714 కావడం గమనార్హం.