హాకీ భారతదేశపు జాతీయ క్రీడ. ఈ విషయం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లోనే చదివాం. అయితే ప్రస్తుతం దేశంలో ఫుట్‌బాల్ లేదా క్రికెట్‌కు ఉన్న ఆదరాభిమానాలు హాకీకు దక్కడం లేదు. హాకీ క్రీడ ఒకప్పుడు భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆటగా గుర్తింపు ఉంది. కానీ కాలక్రమంలో హాకీ అంటేనే మరుగున పడే స్థితికి చేరుకుంది. హాకీ ( Hockey ).. మన దేశ జాతీయ క్రీడ. ఈ మాట చెప్పుకోవడానికే తప్ప ఎన్నడూ ఈ ఆటకు అంతటి ప్రాధాన్యత దక్కలేదు. గతమెంతో ఘనమైనా కొన్ని దశాబ్దాలుగా హాకీలో మన ఇండియన్ టీమ్ ఆట దారుణంగా పతనమవుతూ వచ్చింది. ఒలింపిక్స్‌లో 8 గోల్డ్ మెడల్స్ గెలిచిన చరిత్ర ఉన్నా.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు కనీసం అర్హత సాధించలేక చతికిలపడింది. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మళ్లీ అదే ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచే స్థాయికి చేరింది. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ లో పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ విజయంలో ఫీల్డ్‌లో ఆడిన ప్లేయర్స్‌కు ఎంత పాత్ర ఉందో తెర వెనుక అంతకంటే ఎక్కువ పాత్రే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పోషించారు.
మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ తెలుసు కదా. కాసులు కురిపించే ఈ ఆటను ప్రమోట్ చేయడానికి స్పాన్సర్లు కూడా క్యూ కడతారు. కొన్నేళ్లు ఇండియన్ టీమ్ ప్లేయర్స్ జెర్సీలపై తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి వందలు, వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కానీ హాకీ పరిస్థితి వేరు. ఈ గేమ్‌ను స్పాన్సర్ చేయడానికి ఎవరూ అంత సులువుగా ముందుకు రారు. క్రికెట్‌తో పోలిస్తే హాకీకి ఇండియాలో ఏమాత్రం క్రేజ్ ఉండకపోవడమే దీనికి కారణం.
నవీన్ పట్నాయక్ గతంలో హాకీ ప్లేయరే. ఆయన డూన్ స్కూల్లో చదువుతున్న సమయంలో హాకీ గోల్‌కీపర్‌గా ఉన్నారు. అందుకే ఆ ఆటపై ఉన్న ఇష్టంతోనే టీమ్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించడానికి ఆయన ముందుకు వచ్చారు. పురుషుల జట్టుతోపాటు మహిళలూ జట్టుకూ ఐదేళ్ల పాటు స్పాన్సర్‌గా ఉండటానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇది జరిగిన మూడేళ్లకు ఇప్పుడు ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ఒలింపిక్స్ మెడల్ గెలిచింది. మహిళల టీమ్ కూడా మెడల్‌కు అడుగు దూరంలో ఉంది.
2014లో ఒడిశా ప్రభుత్వం చాంపియన్స్ ట్రోఫీ హాకీకి ఆతిథ్యమిచ్చింది. అప్పుడే ఒడిశా స్పాన్సర్షిప్కు బీజం పడింది. ఆ టోర్నీపై నవీన్ పట్నాయక్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆ తర్వాత 2017లో ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్‌గా ఉన్న కలింగ లాన్సర్స్ టీమ్ హాకీ ఇండియా లీగ్‌ను గెలిచింది. ఇక 2018లో హాకీ వరల్డ్ లీగ్‌ను కూడా ఒడిశా నిర్వహించింది. ఆ తర్వాత 2019లో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ మెన్స్ సిరీస్ ఫైనల్స్, ఒలింపిక్ హాకీ క్వాలిఫయర్స్.. 2020లో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ కూడా ఒడిశాలో జరిగాయి. ఇలా ఇండియన్ హాకీ వేసే ప్రతి అడుగులోనూ నవీన్ పట్నాయక్ తెర వెనుక హీరోగా ఉంటూ వస్తున్నారు.