ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ హాకీ పురుషుల (Indian Men's Hockey Team) జట్టు చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ విశ్వక్రీడల్లో మెడల్ సాధించింది. గురువారం జరిగిన పురుషుల హాకీ బ్రాంజ్(Bronze Medal) ఫైట్‌లో భారత్ 5-4 తేడాతో బలమైన జర్మనీని చిత్తు చేసింది. అఖండ భారతావనిని మురిపించింది. టోక్యోలో భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. అసాధారణ ఆటతో అద్భుత విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం ముద్దాడింది.
ఒకప్పుడు 8 గోల్డ్ మెడల్స్‌తో ప్రపంచాన్నే గడగడలాడించిన మన హాకీ టీమ్.. ఇప్పుడు బ్రాంజ్ మెడల్ గెలిచినా పెద్ద సంబురంగా జరుపుకుంటున్నాం. దేశమంతా ఈ మెడల్ కోసం ఒకటా రెండా.. ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు వేచి చూసింది. మొత్తానికి మన్‌ప్రీత్ సేన సాధించింది. అయితే ఈ విజయంలో ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా అభిమానులు కీర్తిస్తున్న గోల్‌కీపర్ శ్రీజేష్( PR Sreejesh )దే కీలకపాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ టోర్నీలో అతడు సేవ్ చేసినన్ని గోల్స్ మరే గోల్ కీపర్ చేయలేదేమో.
గురువారం జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లోనూ శ్రీజేష్ సత్తా చాటాడు. మ్యాచ్ మరో ఆరు సెకన్లలో ముగుస్తుందనగా.. ఇండియా స్కోరును సమం చేయడానికి ప్రయత్నించిన జర్మనీ ఆశలను అడ్డుకున్నాడు. చివరి క్షణాల్లో ఆ టీమ్‌కు పెనాల్టీ కార్నర్ దక్కగా.. దానిని గోల్‌గా మలచి స్కోరు సమం చేయడానికి జర్మనీ ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాన్ని శ్రీజేష్ విజయవంతంగా అడ్డుకున్నాడు. దీంతో 5-4 స్కోరుతో గెలిచి బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకుంది టీమిండియా.
ఇదొక్క గోలే కాదు.. మొత్తం ఒలింపిక్స్‌లో గోల్‌కీపర్‌గా శ్రీజేష్ కీలకసమయాల్లో ఎన్నో గోల్స్ అడ్డుకున్నాడు. ఎంతో ఒత్తిడి సమయాల్లోనూ చెక్కు చెదరని ఏకాగ్రతతో అతడు అడ్డుకున్న గోల్సే మొదట టీమిండియాను సెమీస్‌కు తీసుకెళ్లాయి. ఇప్పుడా అడ్డుగోడ వల్లే దశబ్దాలుగా ఎదురు చూసిన మెడలూ దక్కింది.
అయితే, దీని కోసం శ్రీజేష్ ఎంతో త్యాగం చేశాడు. గత ఆరు నెలల నుంచి కనీసం తన భార్య ముఖం కూడా చూడలేదు. ప్రాక్టీస్ కోసమే ఈ ఆరు నెలల జీవితాన్ని అంకితం చేశాడు. ఇక, ఇప్పుడు మెడల్ దక్కడంతో తన కుటుంబంతో సరదాగా గడపాలని కోరుకుంటున్నాడు. " ఈ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలియడం లేదు. కానీ, నా కుటుంబాన్ని చూడదల్చుకుంటున్నారు. గత ఆరు నెలల నుంచి వాళ్లకి దూరమయ్యాను. ఇక, ఇప్పుడు వాళ్లతో సరదాగా గడపాలని కోరుకుంటున్నాను " అని శ్రీజేష్ మీడియాకు తెలిపాడు.
కేరళలోని ఎర్నాకుళం జిల్లా కిళక్కమ్బాలమ్ అనే గ్రామానికి చెందిన వ్యక్తి ఈ గోల్‌కీపర్ శ్రీజేష్. స్కూల్ రోజుల్లో ఒక్క హాకీ తప్ప అన్ని గేమ్స్‌లోనూ అతడు చాంపియనే. అదీ ఇదీ అని కాదు.. డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, రన్నింగ్, లాంగ్ జంప్, హైజంప్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ ఇలా అన్నింట్లోనూ శ్రీజేష్ సత్తా చాటాడు. చివరికి తాను ఏ స్పోర్ట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలో కూడా తెలియని స్థితిలోకి వెళ్లిపోయాడు. అయితే అప్పటి వరకూ అసలు ఎప్పుడూ ఆడని హాకీయే తన కెరీర్‌గా మారుతుందని అతను ఊహించలేకపోయాడు. 12 ఏళ్ల వయసులో జయకుమార్ అనే హాకీ కోచ్ అతన్ని మెల్లగా హాకీ గోల్‌కీపింగ్ వైపు తీసుకెళ్లాడు.
2006లో తొలిసాని నేషనల్ టీమ్‌కు వచ్చిన తర్వాత సీనియర్లు ఆడ్రియన్ డిసౌజా, భరత్ ఛెత్రీల నీడలో ఎదిగాడు. ఆ తర్వాత మెల్లగా ఇండియన్ టీమ్ ప్రధాన గోల్‌కీపర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2014లో ఏషియన్ గేమ్స్‌లో ఇండియా గోల్డ్ మెడల్ సాధించడంలో అతని పాత్రే కీలకం. ఫైనల్లో పాకిస్థాన్‌పై రెండు పెనాల్టీ స్ట్రోక్స్‌ను అతడు అడ్డుకున్నాడు. ఆ తర్వాతి ఏడాది చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా బ్రాంజ్ మెడల్ గెలవగా.. శ్రీజేష్ గోల్‌కీపర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు. 2016 ఒలింపిక్స్‌కు ముందు టీమ్ కెప్టెన్ అయ్యాడు. అయితే ఆ గేమ్స్‌లో ఇండియా క్వార్టర్ఫైనల్లో బెల్జియం చేతిలో ఓడింది. ఇప్పుడు.. కాంస్య పతకాన్ని సాధించి తన కలను నెరవేర్చుకున్నాడు.