JAMM గతేడాదిలాగే జమ్మూకశ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) ఈసారి కూడా ఐపీఎల్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగిన ప్రతి సారీ ఉమ్రాన్ మాలిక్ పేరు ప్రస్థావన రాక మానదు. ఎందుకంటే అతని బంతులు రాకెట్లులా దూసుకెళ్తుండటమే కారణం. 22 ఏళ్ల ఉమ్రాన్ బౌలింగ్ చేస్తుంటే దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్‌ను క్రికెట్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఒక మ్యాచ్‌ను మించి మరో మ్యాచ్‌లో అన్నట్లుగా ఈ హైదరాబాద్ పేసర్ వేగం పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. హైదరాబాద్ తరఫున బుల్లెట్ బంతులతో గత సీజన్లో అందరినీ ఆకర్షించిన 22 ఏళ్ల ఈ శ్రీనగర్ బౌలర్‌ను ఈ సీజన్‌కు ఆ జట్టు అట్టిపెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈసారి సీజన్లో అతడు రాణిస్తున్నాడు. ముఖ్యంగా అతడి వేగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
క్రికెట్లో ఉమ్రాన్ ప్రయాణం అతని బౌలింగ్ లా వేగంగానే సాగింది. 2017 వరకు ఉమ్రాన్ మాలిక్ కు ప్రొఫెషనల్ క్రికెట్ గురించి ఏమీ తెలియదు. అయితే, అతను జమ్మూలో టెన్నిస్ బాల్ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకరోజు స్నేహితుడు అబ్దుల్ సమద్ తన కోచ్ రణధీర్ మన్హాస్‌ని ఉమ్రన్ వద్దకు తీసుకువెళ్లి.. అతని బౌలింగ్ చూడమని అభ్యర్ధించాడు. నెట్స్‌లో ఉమ్రాన్ బౌలింగ్‌ని చూసిన కోచ్ కూడా ఆశ్చర్యపోయాడు. దీంతో, అక్కడ నుంచి ఉమ్రాన్ ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారడం మొదలైంది. అంతకుముందు ఎప్పుడూ ఉమ్రాన్ రెగ్యూలర్ శిక్షణ తీసుకోలేదు. కానీ.. రణధీర్ నువ్వు ఏదో రోజు భారత జట్టులో చోటు సంపాదిస్తావ్ అనేసరికి.. ఆ మాటలతో తన లక్ష్యం వైపు అడుగులేయడం ప్రారంభించాడు.
ఉమ్రాన్ మాలిక్ జమ్మూలో అండర్-19 క్రికెట్ జట్టు కోసం అరువు తెచ్చుకున్న స్పైక్ షూస్ ధరించి ట్రయల్ ఇచ్చాడు. ఆ తర్వాత జమ్మూ మరియు కాశ్మీర్ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ అతను వినూ మన్కడ్ ట్రోఫీలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. మరుసటి ఏడాది, అండర్-23 ట్రయల్స్‌లో మాలిక్ వైఫల్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అయితే, 2019-20 రంజీ ట్రోఫీ సీజన్లో ఉమ్రాన్ కు ఊహించని అదృష్టం తలుపు తట్టింది. భారత మాజీ వికెట్ కీపర్ మరియు అస్సాం కోచ్ అజయ్ రాత్రా తమ జట్టు ప్రాక్టీస్ కోసం కొంతమంది నెట్ బౌలర్లను కోరాడు. దీంతో, ఉమ్రాన్‌కి బౌలింగ్ చేసే అవకాశం లభించింది. కానీ అతని బౌలింగ్ చూసి అజయ్ రత్రా షాకయ్యాడు.
ఉమ్రాన్ మాలిక్ గత 5 సంవత్సరాల క్రితమే క్రికెట్ బాల్‌తో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత తక్కువ సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అతని కోచ్ రణధీర్ సింగ్ మన్హాస్ కూడా దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రణధీర్ ప్రకారం రాబోయే రోజుల్లో ఉమ్రాన్ వేగం మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈసారి సీజన్లో అత్యంత వేగంగా బంతులు వేసిన బౌలర్ల జాబితా చూస్తే.. టాప్-5లో అన్ని పేర్లూ ఉమ్రాన్‌వే. అందుకే సామాజిక మాధ్యమాల్లో ఉమ్రాన్ పేరు మీద పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మైదానానికి రావడం.. రికార్డు వేగంతో బంతి విసరడం.. ఇందుకు గాను ఇచ్చే రూ.లక్ష బహుమతిని సొంతం చేసుకోవడం ఇదే అతడి దినచర్యగా మారిపోయిందంటూ సరదా వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి ఉమ్రాన్ మీద. ఉమ్రాన్ వేగం.. అతడి వయసు దృష్టిలో పెట్టుకుంటే భారత్‌కు ఓ మంచి పేసర్ సిద్ధంగా ఉన్నట్లేనని హర్ష భోగ్లే, రవిశాస్త్రి లాంటి వ్యాఖ్యాతలు అభిప్రాయపడుతున్నారు.