వాస్తవానికి టోర్నీ ఆరంభానికి ముందు కిడాంబి శ్రీకాంత్ గాయపడ్డాడు. కరోనా వైరస్ పరీక్షల కోసం అతని నుంచి వైద్య సిబ్బంది నమూనాల్ని సేకరించే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. శ్రీకాంత్ ముక్కుకి గాయమైంది. మంగళవారం తన ముక్కులో నుంచి రక్తం కారుతున్న ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్రీకాంత్.. టోర్నీ నిర్వాహకుల తీరుపై విమర్శలు గుప్పించాడు. దీంతో శ్రీకాంత్ గాయంపై నివేదిక ఇవ్వాల్సిందిగా థాయ్‌లాండ్ ఓపెన్ నిర్వాహకుల్ని బీడబ్ల్యూఎఫ్ ఆదేశించింది.
ఇక టోర్నీ ఆరంభానికి ముందు షట్లర్లకు కరోనా పరీక్షలు చేయగా.. భారత టాప్ షట్లర్లు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ మంగళవారం వెల్లడించింది. జనవరి 11న నిర్వహించిన మూడో రౌండ్ తప్పనిసరి పరీక్షలో సైనాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందనేది అబద్ధమని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం సాయంత్రం వెల్లడించింది. దీంతో సైనా కు రూట్ క్లియర్ అయింది.