విరాట్ కోహ్లీ..(Virat Kohli) క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. తన బ్యాటింగ్ తో ఎన్నో రికార్డుల్ని కొల్లగొట్టి.. క్రికెట్ ను ఏలుతున్న కింగ్. అయితే, విరాట్ కోహ్లీ అగ్రెసివ్ గురించి మనకు తెలిసిందే. ఆఫ్ ఫీల్డ్ ఎంతో వినయంగా నడుచుకుంటూ, ఫన్నీగా అందరితో కలిసిపోయి నవ్వుతూ నవ్వించే విరాట్ కోహ్లీ. ఆన్ ది ఫీల్డ్ మాత్రం చాలా అగ్రెసివ్. ఏదైనా తప్పు చేస్తే, తప్పు చేశారని అనుకుంటే సొంత జట్టు ప్లేయర్లపై కూడా నోరుపారేసుకుంటూ ఉంటాడు కోహ్లీ.
అయితే కోహ్లీ అనూహ్య నిర్ణయానికి కారణాలు తెలియకపోయినా.. అనేక ఆసక్తికర కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలోనే ఓ సీనియర్ ఆటగాడు.. కోహ్లీ ప్రవర్తన బాలేదని బీసీసీఐ (BCCI) సెక్రటరీ జైషాకు ఫిర్యాదు చేశాడని 'ది టెలిగ్రాఫ్' ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఆ సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్వినే(Ravichandran Ashwin)నని ఓ ప్రముఖ వార్తా సంస్థ స్పష్టం చేసింది.
న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్బంగా కోహ్లీ- అశ్విన్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు పేర్కొంది. ముఖ్యంగా సీమింగ్ కండిషన్స్‌లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడం జట్టుకు చేటు చేసింది. ఈ ఫ్రస్టేషన్ అంతా కోహ్లీ అశ్విన్‌పై చూపించాడని, అతని ప్రవర్తన పట్ల అశ్విన్ విసుగు చెందాడని ఆ కథనంలో తెలిపింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత కోహ్లీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని, సహచర ఆటగాళ్లు, కోచ్‌ల పట్ల అతని వైఖరి ఇబ్బందిగా మారిందని ఓ సీనియర్ ప్లేయర్ బీసీసీఐ సెక్రటరీ జైషా దృషికి తీసుకొచ్చాడని, దీంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆయన రంగంలోకి దిగాడని ఓ బీసీసీఐ అధికారి తమకు తెలిపినట్లు టెలిగ్రాఫ్ పేర్కొంది. ఈ పరిణామాలను పసిగట్టిన కోహ్లీ ముందుగానే తన నిర్ణయాన్ని ప్రకటించాడని తెలిపింది.
కోహ్లీ టీ20 కెప్టెన్సీ మాత్రమే వదులు కోవడంతో రోహిత్ శర్మకు ఆ ఒక్క ఫార్మాట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలా? లేక పరిమిత ఓవర్ల కెప్టెన్సీ ఇవ్వాలా? అనే విషయం బీసీసీఐ తేల్చుకోలేకపోతుంది. అయితే టీ20 ప్రపంచకప్ గెలవకపోతే మాత్రం కోహ్లీ వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా తప్పుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది.