అంతర్జాతీయ క్రికెట్లో తెలివైన ఆటగాళ్లు, సారథులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎంఎస్ ధోనీ మాత్రం అందరికీ భిన్నం. అతడి క్రికెట్ పరిజ్ఞానానికి మరొకరు సాటిరారు. అవతలి జట్టులో ఎవరి బలాబలాలేంటి? ఎవరెప్పుడు బౌలింగ్ చేస్తారు? ఎలాంటి బంతులు వేస్తారు? ఏ బ్యాట్స్‌మన్ ఎలా ఆడతాడు? ఏ ప్రణాళికలు అమలు చేస్తారు? పిచ్ ఎలా ఉంది? మ్యాచ్ సమయంలో వాతావరణం ఎలా ఉంటుంది? 24 గంటల ముందు ఎలా ఉండేది? వర్ష సూచన ఉందా? మ్యాచులో ఏ సమయంలో పడే అవకాశం ఉంది? వంటి వివరాలన్నీ కూలంకషంగా గమనిస్తాడు. (photo credit : twitter)
జట్టు యాజమాన్యంతో కలిసి వ్యూహాలు రచించి ఎదురుదాడికి దిగుతాడు. అప్పటి వరకు ఎవరికీ పరిచయం లేని ఆటగాళ్లతో అద్భుతాలు చేయిస్తాడు. ప్రత్యర్థులను వణికిస్తాడు. దీపక్ చాహర్, హార్దిక్ పాండ్య, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవే ఇందుకు ఉదాహరణ. వారికి బౌలింగ్‌లో ప్రాథమిక అంశాలు తెలిస్తే చాలు! ఏ లైన్.. ఏ లైంగ్త్.. ఎక్కడ పిచ్ చేయాలి? ఎలాంటి డెలివరీ వేయాలి? ఫీల్డర్లను ఎక్కడ మోహరించాలి? ఏ బంతి వేసి బ్యాట్స్‌మన్‌ను ఎలా ఆడించాలి? అన్నది ధోనీ చెప్పేస్తాడు. (photo credit : twitter)
విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలు అందుకున్నాక ధోనీ అతడికి అండగా ఉన్నాడు. ఎన్నో సార్లు మహీ సలహాలు ఇవ్వడం చూశాం. వ్యూహాలు రచించడం, వాటిని సక్రమంగా అమలు చేయడం, ప్రత్యర్థులపై వల పన్నడంలో సాయపడేవాడు. ఏమైనా పొరపాట్లు జరుగుతుంటే మందలించేవాడు. లాంగాఫ్, లాంగాన్‌లో కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ధోనీ బౌలర్లకు మార్గనిర్దేశం చేసేవాడు. మ్యాచ్ పరిస్థితికి తగ్గట్టుగా బంతులు వేయించేవాడు. ఏ లైన్, ఏ లెంగ్త్‌లో బంతులను పిచ్ చేయాలో హిందీలో ఆదేశించేవాడు. ప్రస్తుతం టీమ్ఇండియా ఇదే మిస్సవుతోంది. (photo credit : twitter)
వికెట్ కీపర్‌గా రాహుల్ అదరగొడుతున్నా.. బౌలర్లకు సలహాలు ఇస్తున్నా అతడికి ఇంకా పరిణతి, అనుభవం అవసరం. ఐపీఎల్లో కెప్టెన్‌గా ధోనీ పాత్రను బాగానే పోషించాడు. అయితే అతడు మరింత చాకచక్యంగా మారాలి. ఆసీస్‌తో ఆఖరి టీ20లో నటరాజన్ బౌలింగ్‌లో మాథ్యూవేడ్ సమీక్ష విషయంలో ఇది స్పష్టంగా కనిపించింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి కోహ్లీకి ధోనీలాంటి అండ కరవైంది. రోహిత్‌కు అలాంటి అనుభవం, అణకువ, పరిణతి, పరిజ్ఞానం ఉన్నా కెప్టెన్, వైస్ కెప్టెన్ మధ్య బంధం పరిస్థితి ఏంటో ఎవరికీ తెలీదు కదా మరి!